Monday, August 31, 2009

పిల్ల కష్టాలు

నాకు నా చిన్నప్పట్నుండీ చిన్నపిల్లలతో పడేది కాదు. ఆ ఏజ్ లోనే నా ఏజ్ పిల్లల్తో ఫాక్షన్ గొడవలూ గట్రా జరుగుతూ ఉండేవి. ఐతే అప్పటి బ్యాచ్ లో ఉన్న చిన్నపిల్లలంతా పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ ఏజ్ ని బట్టి స్కూల్లో నైతే పిల్లల్తోనీ , కాలేజ్లో నైతే మిగతా స్టూడెంట్స్ తోనీ గొడవలు పెట్టుకుంటూ...మరీ పెద్దయ్యి జీవితంలో స్తిరపడ్డాకా ఎవడుపడితే వాడితోనీ గొడవలుపెట్టుకుంటూ బ్రతుకుతున్నారు.

ఆదేంటో
నా విషయంలో మాత్రం ఇంత పెద్దయ్యాక కూడా ఎటువంటి మార్పూ లేదు... ఇప్పటికీ చిన్నపిల్లల్తో గొడవలు జరుగుతూనే వున్నాయ్.....నా మానాన నేను బ్రతుకుతున్నా ఇప్పటికీ ఇంట్లోనో...వీదిలోనో ఎవడో ఒక పిల్ల కుంక తో పోరాటం తప్పటంలేదు... :-(

నాకో మేనల్లుడున్నాడు .....పేరు పవన్ కుమార్ ...సార్ధక నామదేయుడు.... గెరిల్లా యుద్దతంత్రం లో అందేవేసిన చెయ్యి...అంటే మనం టీనో కాఫీనో మూతి దగ్గరపెట్టుకుని వూదుకుని తాగేప్పుడు మనల్ని తోసేసి పారిపోవటం, మనం ఫోన్ లో ఎవరితోనైనా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు ఏ తొడ మీదో గట్టిగా గిచ్చి పారిపోవటం ఇత్యాది రకాల ఈవెంట్స్ లో మనోడిని కోట్టేవోడే లేడు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, గేదె పుట్టగానే గడ్డి మేసినట్టు.....వీడు పుట్టిన మూడేళ్ళకే ఉగ్రవాదిగా మారి కనిపించిన ప్రతీవోడినీ పీక్కు తినేస్తుంటే భరించలేక మా అక్క వాళ్ళు వీడిని మా ఇంట్లో పడేసి పోయారు....వీడికీ నాకూ మద్య పచ్చగడ్డే కాదు పచ్చి సెనగపప్పు వేసినా భగ్గు మంటుంది...కానీ ప్రతీసారీ నాకే కాలుతుంది. :-(


వీడి మిగతా టాలెంట్స్ సంగతేమోకానీ, అందరినీ గిచ్చటం అనే టాలెంట్ మాత్రం నా చలవేనేమో అని నాకో పేద్ద డౌటు....

వీడికి 1 సంవత్సరం వయసున్నప్పుడు నేను వీళ్ళింటిలోనే ఉండేవాడిని.....వీడిని 24 గంటలూ ఎవడోకడు ఎత్తుకునితిప్పాలి.....నేను సాయత్రం ఆఫీసు నుంచి రావడం పాపం... వీడిని నా మీదకి తోలేసేవోరు...రెండు చేతులూ మార్చుకున్తూ వీడిని మోసేసరికి ఒక వారానికి నా రెండు భుజాలు మాంచి కండలు తిరిగి మిగతా బాడీ మాత్రం సన్నగా అలానే ఉండిపోయింది....మొత్తానికి 'పాపాయ్' లాగా తయారయ్యాను.

ఈహ ఇలాక్కాదు అని చెప్పి...రోజూ ఒక పావుంగంట మొయ్యటం..తర్వాత ఎవరూ చూడకుండా వాడి పిర్ర మీద చిన్నగా గిల్లేవాణ్ణి ....వీడు "'కేర్ర్ర్ర్ర్ర్ర్....." మనేవాడు ......అరెరే వీడు నా దగ్గరుండటంలేదు...అని మా అక్కకిచ్చేసేవోణ్ణి.... :-)


ప్లాను వర్కవుట్ అయ్యింది..... అలా కొంత కాలం హ్యాపీ గానే గడిచింది...ఈలోగా మా వాడు కొంత లోకజ్ఞానం సంపాయించినట్టున్నాడు...నేను చిన్నగా గిల్లగానే గిల్లిన చోట చేత్తో పట్టుకుని "క్కే....ర్ర్ర్ర్ర్ర్" అని రాగం మొదలెట్టి ఎవరో ఒకరొచ్చి చూసేవరకు ఆపేవాడు కాదు.......ఎందుకొచ్చినగొడవరా బాబూ దొరికిపోయేట్టున్నాను అని చచ్చినట్టు గంట మోసేవాణ్ణి ....

తర్వాత్తర్వాత వీడు తెలివి వయసుకన్నా ముదిరిపోయి.... నేను ఇంట్లోకి రావడం పాపం "క్కేర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
ర్ర్ర్ " మని అరుస్తూ ఏ కాలో చెయ్యో చూపించడం మొదలెట్టి నన్ను భయపెట్టేవోడు..... అలా భయపెట్టీ భయపెట్టీ బాగా అరితేరిపోయి ఇప్పుడు నన్ను రోజుకి ఓ ముప్పయి సార్లు గిల్లి ముక్కలు తీసేస్తున్నాడు.

వినాయకచవితికదానీ....మా అమ్మ వీడిని తీసుకుని గుడికెల్లింది....ఇల్లంతా ప్రశాంతంగా ఉంది....


తీరిగ్గా
కూర్చొని స్వాతిలో వారఫలాలు చూస్తున్నాను..... తులా రాసిలో "అనుకోని కలహాలు ఎదురవును...జాగ్రత్తతో వ్యవరించవలెను " అని రాసుంది. వెంటనే నా ఎడమకన్ను టపటపా కొట్టుకుంది .....వాకిట్లో మా అక్క ఫ్రెండూ, తన నాలుగేళ్ళ కొడుకు ప్రత్యక్షమయ్యారు......ఆకాశవాణి ఎంటర్ ద డ్రాగన్ అని అరిచింది.



వీణ్ణి చూస్తే కొద్దిగా తేడాగా కనిపించాడు.... మావాడితో నాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబాట్టి ఇలాంటి కేసుల్ని ఈజీ గా కనిపెట్టేస్తా....... అయినా ఎందుకైనా మంచిదని కామ్ గా కూర్చున్నా..

వాడు వచ్చీ రావడంతోనే "అమ్మా... ఇది నాదీ" అని దీర్ఘం తీస్తూ నా చేతుల్లోంచి స్వాతి లాగేసుకుని యుద్దానికి సమర శంఖం మోగించాడు. టీపాయ్ మీదున్న నా సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్లు అలా తిరగేస్తున్నాను.....అంతే


"అమ్మా....ఇది నాదీ " ......


నిశ్శబ్ధంగా వాడివంక చూసి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసాను...తల తిప్పకుండా వాడి వంక ఓరకంట చూసాను....వాడూ నా వైపు అలానే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి.. రిమోట్ లాక్కొని "అమ్మా.... నేను పోగో చానెల్ చూతా " అని చానెల్స్ నొక్కడం మొదలెట్టాడు...


వచ్చిన
మూడొ క్షణంలోనే నా మూడు ఐటంస్ లాగేసుకున్నాడు....... నాకు బీపీ పెరిగిపోయింది...నా చిన్నప్పటి గతం గుర్తుకొచ్చింది నాలోని పిల్ల సిమ్హారెడ్డి బయటకొచ్చాడు.. విసురుగా రిమోట్ లాక్కున్నా ..... వాడు ఒక్క క్షణం గాల్లోకి చూసి తర్వాత కింద కూర్చుని కాళ్ళు బార జాపుకుని తల పైకెత్తి నోరు పెద్దది చేసుకుని "వ్వ్వ్వ్వాఆ.........." అంటూ రాగం మొదలెట్టాడు....అంతే నాలుగు సుఖోయ్ ఫైటర్ జెట్ లు మా ఇంటి వరండాలోంచి టేక్ ఆఫ్ అయినట్టు పేద్ద సౌండ్ లాంటి కూత మొదలయ్యింది... వీడి రాగం విని వాళ్ళమ్మ పరిగెట్టుకొచ్చింది....నేను ముందు జాగ్రత్తగా రిమోట్ వాడి చేతిలో పెట్టేసాను....వాళ్ళమ్మ ఏవయ్యిందిరా ...అనేలోపే వీడు చెయ్యి నిటారుగా లేపి నా వైపు పాయింట్ చేసి 'వ్వ్వ్వాఆ " అంటూ రాగం ఏమాత్రం చెడకుండా శ్రుతి కొంచెం పెద్దది చేసాడు.


అడ్డంగా బుక్ చేసేసాడు....తక్షణం కవరింగ్ ఇచ్చుకోవాల్సిన పరిస్తితి. ..
" అబ్బే ఏం లేదండీ పోగో చూస్తానన్నాడు....చానెల్ పెట్టుకోడం రాక ...నేను పెడతానంటే" ఏడుస్తున్నాడు....
హి హి హీ అని తెచ్చిపెట్టుకున్న నవ్వొకటి ఆవిడ కిచ్చాను.


పోగో అంటే ప్రాణం వెదవకి అది తప్పితే ఇంకోటి చూడడు వెధవ....అని మురిసిపోయింది వాళ్ళమ్మ.....వాడితో ఏడవకూడదు నాన్నా నీకు తెలీపోతే అంకుల్ ని అడిగి పెట్టించుకోవాలి....అని రిమోట్ నాకిచ్చి తిరిగి రూంలో కి వెళ్ళిపోయింది.....

పిల్లకుంక విజయ గర్వంతో కళ్ళు తుడుచుకుని..... చూసావా నీ కన్నుతో నిన్నే పొడిచా....మర్యాదగా పోగో పెట్టు .. అన్నట్టు చూసాడు.

ఇంక ఈ పిల్ల రాక్షసుడితో పడే కన్న బయటకు ఎక్కడికోచోటకి పోవడం బెటర్ అని డిసైడయ్యి ...లోపలికెళ్ళి రెడీ అయ్యి హాల్ లోకి వచ్చి షూస్ వేసుకుంటూ వాడి వంక చూసా.......వాడు ఈ సారి నేను దేన్ని పట్టుకుంటానా ...దాన్ని ఎప్పుడు లాగేసుకుందామా అని చాలా కాన్సంట్రేషన్ తో నన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు.... నేను ఓ నవ్వు నవ్వి " నే బయటకెళుతున్నా " అని మా అక్కకి వినపడేలా ఒక కేక వేసి టేబుల్ మీదున్న నా బైక్ కీస్ తీసుకుందామని లేచా......
అప్పుడు తెలిసింది వీడి బ్రైన్ సూపెర్ కంప్యూటర్ కి ముత్తాత అని. ....వాడు టప్పున లేచి చెంగున గెంతి నిమిషంలో వందో వంతులో నా బైక్ కీస్ తీసుకుని ..... " అమ్మా ...ఇది నాదీ " అన్నాడు....


నా మీద నాకే జాలి, కోపం, ఆగ్రహం, ఆవేశం, అంకుశం,...ఆహుతి కలిగాయి...అయినా తమాయించుకుని
" కళ్ళు ఎర్రగా చేసి ....వాడి వంక చూస్తూ....పైకి మాత్రం " కీస్ ఇచ్చేయమ్మా ఆచ్ వెళ్ళాలి " అన్నా.....

" ఆ ఇది నాదీ ...." అని ఈసారి తాళం గుత్తిని గట్టి ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు....

ఈదెబ్బతో
నాకు మసాలా నషాలానికి అంటింది .....వాడి దగ్గిరికెళ్ళి మొహమంతా కోపం చేసుకుని "కధకలి" డ్యాన్స్ లో మొహం లో ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారో అన్నీ చూపించి ...కీస్ ఇవ్వరా అన్నా.....సీను రిపీట్ అయ్యింది.. ఈసారి వాడు 10 సుకోయ్ , 15 మిరేజ్ ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించాడు........వాళ్ళమ్మ పరిగెట్టుకొచ్చింది ....ఈ సారి చాన్స్ మాత్రం వాడికివ్వకుండా నేను నా చెయ్యి నిటారుగా పైకి లేపి వాడి వైపు పాయింట్ చేసి " నా బైక్ కీస్ ....నేను బయటకెళ్ళాలి " అని చెప్పా.

వాళ్ళమ్మ వెంటనే వాడి దగ్గరనుంచి ఏదైనా వెనక్కి తీసుకోవాలంటే ఒక మంత్రం ఉందని దాన్ని నాకు ఉపదేశిస్తానని చెప్పి నాదగ్గరకొచ్చి నా చెవిలో "ఆ మంత్రం పేరు - క్యాచ్ " అంది.

"క్యాచ్ చేయలేకపోయాను.... కాస్త సరిగ్గా చెప్పండి " అన్నా....

వాడి చేతిలో వున్నదేదైనా మనం ఇమ్మంటే ఇవ్వడు.......అదే "క్యాచ్" అన్నామనుకో వెంటనే మనమీదకి విసిరేస్తాడు.. అని చెప్పింది.

పోన్లే ఏదో ఒహటి అని వెంటనే ..నేను వాడివైపు తిరిగి "క్యాచ్ " అని అరిచా...... వాడు వెంటనే మొహమంతా 100 వాట్స్ బల్బు లాగా పెట్టి కీస్ నా మీదకి కాకుండా గుమ్మలోంచి బయటికి విసిరేసాడు......

'ఒరేయ్...^%&$^%$&%*"


ప్రతీరోజులాగే ఈరోజుకూడా ఓ పిల్లకుంక చేతిలో ఓడిపోయా ....
నేను కీస్ వెతుక్కుంటూ అస్తమిస్తున్న సూర్యుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయా....

Tuesday, May 19, 2009

పెళ్ళి - అనుభవం

అదిగో అదిగో ...టైటిల్ చూసి కంగారు పడకండి..ఇక్కడ "పెళ్ళి" నాది కాదు..కానీ "అనుభవం" మాత్రం నాదే...అదిగో అదిగో మళ్ళీ అపార్థం చేసుకుంటున్నారు.."అనుభవం" అంటే "పెళ్ళికెళ్ళిన అనుభవం" అని.....సరే ఇలాకాదుగానీ విపులంగా చెప్తా.. ఆరోజు అసలేం జరిగిందంటే..



మద్యాహ్నం ఫుల్లుగా తినేసి పక్కేసిన నాకు ...ప్రక్క గదిలో ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించడంతో సడెన్ గా మెలుకువొచ్చింది..కంగారుగా హాల్ వైపు పరిగెత్తాను..హాల్ లో అమ్మా,నాన్నమ్మా ఏడుస్తూ కనిపించారు...హడలిపోయి..ఏవయ్యిందీ అని గట్టి గా అరిచా...


ఏమీ చెప్పకుండా నోటికి చేతిని అడ్డంపెట్టుకుని బావురుమంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మ...నాన్నమ్మవైపు చూసా...'మహ్హ త్రుదేవోభా..' అని ముక్కు చీదుకుంటూ టీవీ వైపు చూపించింది నాన్నమ్మ.


టీవీ లో "మాతృదేవోభవ" సినిమా లో మాధవి ఏడుస్తూఉంది.....విషయం అర్ధమయ్యింది .....నాకు తిక్కరేగిపోయింది...


టీవీ ఎత్తి మా సెకండ్ ఫ్లోర్ లోంచి కిందకి పడేద్దాం అనే అలోచనని బలవంతంగా తొక్కిపెట్టి..డోర్ తీసి అక్కడున్న కటకటాలకేసి నా తలబాదుకున్నా...అక్కడ ' పోస్ట్ మాన్ కిందకూర్చిని కటకటాల్లోంచి సినిమా చూస్తూ ఏడుస్తూ కనిపించాడు ' .


ఇంకతట్టుకోలేక...గబ గబా కుర్చీ లాక్కుని ఫాన్ కి చీర ముడేయడం మొదలుపెట్టా....అయ్యో అయ్యో మొన్న దీపావళి కి మా అన్నయ్య పెట్టిన చీర అంటూ పరిగెత్తుకొచ్చి చీరలాక్కోంది మా అమ్మ. ఈ హడావిడితో లోకంలోకి వచ్చినట్టున్నాడు పోస్ట్ మాన్ ...కళ్ళు తుడుచుకుని.."పోస్ట్" అని గట్టి గా అరిచి ..ఒక కవర్ లోపలకి పడేసీ వెళ్ళిపోయాడు.



అది శుభలేఖ ...నా చిన్నప్పటి ఫ్రెండ్ శరత్ గాడి పెళ్లి ..అదీ రేపే..ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం చూసా వాడిని...కచ్చితంగా వెళ్ళాలి..వాడు నెల క్రిందటే ఫోన్ చేసి చెప్పాడు...అసలందుకనే బెంగుళూర్ నుంచి వచ్చింది. ఆల్రెడీ ఇంకో చిన్నప్పటి ఫ్రెండ్ తో మాట్లాడా ...వాడూ వస్తున్నాడు ..నేను రాత్రికి రావులపాలెం లో దిగితే అక్కడ్నుంచి వాడూ నేనూ కలిసి బండి మీద పెళ్లి కి వెళ్తాం...అదీ ప్లాను..



నీటుగా తయారయ్యి ...నేవెళ్తున్నా అని కేక వేసి బయలుదేరా....అమ్మా, నాన్నమ్మ..ఇంకా ఏడుస్తూనే వున్నారు..అప్పడే వచ్చిన మా పనమ్మాయ్ 'బాబు తొందరగానే వచ్చేస్తాడ్లే అమ్మా...ఈమాత్రందానికే కల్లనీళ్ళెట్టుకోవాలా' అంటోంది...


మళ్ళీ నేనెక్కడ తలబాదు కుంటానో అని మా నాన్నమ్మ తలుపుకి అడ్డంగా నిలబడింది....నేను ఒక వెర్రి నవ్వు నవ్వి ఇంట్లోంచి బయటపడ్డా..



కిటికీ పక్క సీటు..సాయంత్రం చల్ల గాలి...తెలీకుండానే నిద్రపట్టేసింది.


"సార్ మల్లె పూలు..సేమంతులు .." ఎవడో కిటికీలోంచి నా చేయి మీద కొడుతున్నాడు..ఉలిక్కిపడి లేచా...


'ఏరా..తిక్క తిక్క గా ఉందా..?నన్ను మల్లెపూలు కావాలా..అని అడుగుతున్నావ్' అన్నా...
సమాధానం గా..."బాబూ కొద్దిగా ఆ పూలందుకో అమ్మా.." అని పదిరూపాయలనోటు నా చేతికందించింది...లేడీస్ సీట్లో నుంచి ఒకావిడ.


మాట్లాడకుండా..అది పూలవాడి చేతిలో పెట్టి...పూలు తీసుకుని ఆవిడ చేతిలో పెట్టా..బస్సు కదిలింది.


మరి 'చిల్లరేదీ?' అంది...


ఓర్నాయనో ...వాడు చిల్లర ఇవ్వాలా..అనుకుని...బాబూ చిల్లరంట...అనిక్ కేకేసాను...


వాడు చిల్లర ఇస్తున్నట్టు నటిస్తాడు గానీ చిల్లర ఇవ్వడే...బస్సు స్పీడు పెరిగింది..నాకు టెన్షన్ పెరిగింది...వాడు స్లో మోషన్ లో పరిగెడుతున్నాడు...రెండు నిమిషాల్లో జరగాల్సింది జరిగిపోయింది..వాడు రెండు రూపాయల చిల్లర ఎగ్గోట్టేసాడు.


ఆవిడ నా వైపు చూస్తూ పూలవాడ్ని బండ బూతులు తిట్టి ఓ పాతిక శాపనార్థాలు పెట్టింది...


అత్త మీద కోపం దుత్త మీద చూపించబడింది...
అత్త = (నేను + పూలవాడు)


దుత్త= (ఆవిడ కొడుకు)


"సరిగ్గా కూచోరా ఎధవకానా..దభేల్ దభేల్...ధబెల్..." ఆవిడ పక్కన కూర్చుని జంతికలు తింటున్న కొడుకు వీపు విమానం మోత మోగింది... ఇంక నేను...నిద్రపోతున్నట్టు నటించడం మొదలెట్టా...


అలా ఓ గంట నటించింతర్వాత..రావులపాలెం వచ్చేసింది. దిగి..మా శ్రీను గాడి కోసం చుట్టూ చూసా...ఎవరూ కనిపించలేదు..అయినా వాడిని చూసి చాలాకాలం అయింది..నన్ను గుర్తుపడతాడో లేదో...అనుకుంటుండగా....చేతిలో చిన్న బ్యాగ్ తో ఒకతను నవ్వుకుంటూ నావైపే వస్తున్నాడు...
ఒక్కసారి నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి వొళ్ళు పులకరించింది...వాడు దగ్గరికి రాగానే ..


"ఎన్నాల్లయ్యిందిరా నిన్ను చూసి" అని గట్టిగా కౌగిలించుకున్నా..


"ఛీ ఏంటండీ ఇది...వదలండి...... రాజోలు బస్సు ఎన్నింటికీ అని అడుగుదామని వస్తే ఏంటిది....వదలండి వదలండి" అని విడిపించుకుని పారిపోయాడు.


బస్సు స్టాండ్ లో జనమంతా నన్నే చూస్తున్నట్టనిపించి.. ఏదో అర్జెంట్ పనున్నట్టు అక్కడున్న షాప్ కెళ్ళి సితార కొని అక్కడున్న బెంచీ మీద జారబడ్డా..'ఒరేయ్ బస్సు దిగిచచ్చా ...వచ్చి తగలడు ' అని మా శీను గాడి కి మెస్సేజ్ కొట్టి...సితార చదవటం మొదలుపెట్టాను.


కొంతసేపటికి స్టాండ్ లో జనాలు పల్చబడ్డారు....నేనూ ఇంకో నలుగురు పాసేంజర్సూ..ఇద్దరు పిచ్చోళ్ళు మిగిలాం.. కొంత సేపు అయినతర్వాత...నన్ను ఎవరో గమనిస్తున్నట్టనిపించి..ఆ వైపుకి చూసా....



' ఒకడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గోర్లు కొరుక్కుంటూ నా వైపే చూస్తున్నాడు ..' నేను వాడి వంక చూసేసరికి ...నవ్వి నావైపు నడవడం మొదలుపెట్టాడు..


లాభం లేదు...వీడెవడో తింగరి వెధవ నన్ను తగులుకుంటున్నాడు.....రాత్రి ఏడుగంటలకి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా మెంటల్ కేసే .. వాడ్ని గమనించనట్టు నటిస్తూ సితార చదివేస్తున్నా..


"కనులు కనులతో కలపడితే...ఆ తగవుకు ఫలమేమి"... నా ఎదురుగా నిలబడి అన్నాడు వాడు.


'నా గుండె గొంతుకలోకి జారిపోయింది...ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యమేసింది...ఎక్కడలేని పిచ్చి నాయాల్లంతా నాకే తగులుకుంటారు..అని మనసులో ఏడ్చి...' తల పైకి ఎత్తకుండా వాడి వంక చూడ్డానికి ట్రై చేశా...


"హలో ...కనులు కనులతో కలపడితే...ఆ తగవుకు ఫలమేమి" మళ్ళీ అన్నాడు ...


'నాకు తెలీదు రా...తింగరి వెధవా..అయినా నాకు ఇలా తగులుకున్నావేంట్రా..' అను గొణుక్కుంటూ వాడి వైపు చూసా...


హాశ్చర్యం...వాడే మా శీను గాడే... "ఇదేం అవతారం రా..తిక్కవెధవ..రాత్రిళ్ళు ఆ నల్లకళ్ళద్దాలు పెట్టుకుని పాత పాటలు పాడుకొవటమేంటిరా..పిచ్చిగానీ ఎక్కిందా...ఆ కళ్ళజోడు తియ్ ముందు..." నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అన్నా...


"కనులు కనులతొ కలబడితే ...కళ్ళకలకొస్తుందిరా రిషిగా" అంటూ కల్లజోడు తీసాడు.


చింతనిప్పులా కళ్ళు..దానికితోడు పోకిరి హెయిర్ స్టైలూ ..కలగలిపి డ్రాకులా తెలుగు వెర్షన్ లా వున్నాడు శీను గాడు..
ఒక్కసారి కళ్ళు మండినట్టనిపించి..."ఒరేయ్ నువ్వర్జంటుగా ఆ కళ్ళజోడు పెట్టేస్కో..పాటలు మాత్రం పాడొద్దు.." అని చెప్పి వాడిని బయలుదేరదీసా..


వాడు బండి నడుపుతూ వాడికి వాడి గర్ల్ ఫ్రెండు నుంచి కళ్ళకలక ఎలా అంటుకుందో చెపుతుంటే..నేను ఎనక కూర్చుని 'ఊ..' కొడుతూ అలా అలా..ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ..మొత్తానికి మా శరత్ గాడి ఇంటికి చేరుకున్నాం..


మేం వెళ్ళేసరికి పెళ్ళిసందడి మొదలయ్యింది..ఇల్లంతా పల్లెటూరి పెళ్ళి కళతో సందడిగా ఉంది...ఎక్కడ చూసినా జనాలే జనాలు.
బయట అరుగు మీద ఆడుకుంటున్న పిల్లగాడ్ని పిలిచి..శరత్ ఉన్నాడా అని అడిగాడు మా శీనుగాడు..
"సెత్తన్నయ్యా....నీ కోసరం ఎవరో వచ్చారు ' అని ఓ గావుకేక పెట్టాడా కుర్రోడు..


నాకు మతిపోయి 'సెత్తన్నయ్యేంట్రా...' అన్నాను, నువ్వు కంగారు పడకురా..వాడు శరత్ అన్నయ్యా అని స్పీడుగా అన్నాడు..ఎక్స్ ప్లెయిన్ చేసాడు శీనుగాడు...



ఇంతలో 'మా చెత్త బాబు పెళ్ళికొచ్చారా..రండి ' అని గుమ్మంలో రెండు కుర్చీలు పడెసేడు ఓ ముసలాయన లోపలినుంచి వచ్చి....ఇక్కడ శరత్ గాడిని అందరూ స్పీడు గానే పిలుస్తారన్నమాట..అనుకుని కూర్చీ లాక్కోని కూర్చున్నా.



వాతావరణం చాలా బావుంది..ఏ మాటకామాటే చెప్పుకోవాలి...పల్లెటూర్లో ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా వుండదురా అన్నాను మా శీను గాడితో...ఇలా అన్నానో లేదో...'బాబా సాయి బాబా..నీవు మావలె మనిషివని ' అని చెవులు పగిలిపోయేట్టు పక్కనున్న గుడి మైకులోంచి పాట మొదలయ్యింది..


హా హా నిజమేరా...అన్నాడు శీను గాడు.


ఇంతలో మా శరత్ గాడు వచ్చి...నన్ను గట్టిగా వాటేసుకుని కుశలప్రశ్నలడిగి..శీను గాడ్ని మాత్రం..దూరం నుంచే మాట్లాడి నీ కలక నాకు మాత్రం అంటించకురా..అని బ్రతిమలాడి..


'అరేయ్...మీరు ముందు భోజనాలు చేసి రండి ' అని చెప్పి మాకు అన్నీ దగ్గరుండి చూడమని ఒకడిని పురమాయించాడు.


పర్లేదు మేం వెల్తాం అని..ఆఒకడిని వద్దని చెప్పి..మెల్లి గా మేమే బయలుదేరాం.సందు మలుపు తిరగ్గానే చాలా మంది జనం ఇద్దరు ఇద్దరు బాచ్ లు గా కుస్తీ పట్లు పడుతూ కనిపించారు..


అరేయ్ చూసావా ఇలాంటివి పల్లెటూర్లలోనే జరుగుతాయ్...కొంచెంసేపు చూసెళదాం ఆగు అన్నా సీనుగాడితో..


ఏడిసావ్...అవే భోజనాలు...ఇప్పుడే బంతి లేచినట్టుంది..సీట్లకోసం జనాలు తోసుకుంటున్నారు...పద మనమూ కూర్చుందాం అని పరిగెత్తాడు. నేనూ వాడివెనకే పరిగెత్తా కానీ అలవాటులేక పద్మవ్యూహం లో చిక్కుకు పోయిన అభిమన్యుడిలా జనాల మధ్యలో చిక్కుకుపోయా..ఎలాగోలా తప్పించుకుని లొపలికి వెళ్ళేసరికి జుట్టురేగిపోయి ముక్కుపగిలిపోయిన స్తితిలో సీనుగాడు కనిపించాడు..


'ఒరేయ్ ఈ బంతిలో కూచుందామనుకుంటే బంతాట ఆడేసార్రా..పద అందాకా అక్కడ కూర్చుందాం' అని లొపల్నుంచి ఎత్తుకొచ్చిన రెండు కాజాలు ఇచ్చాడు...అవి తింటూ కబుర్లు మొదలెట్టాం..


అప్పుడే భోజనలానుంచి బయటకొచ్చిన ఒకావిడ హడావిడిగా మా శీనుగాడి దగ్గరకొచ్చి టైం ఎంతయ్యింది బాబూ అని అడిగి..వాడు చూసి చెప్పేలోపులో వాడి చెయ్యిని వంకర తిప్పేసి టైం చూసుకుని .."హా కంగారులేదు ఇంకా టైం ఉంది" అని అనుకుంటూ మళ్ళీ లొపలికి పరిగెట్టింది..


అక్కడికి ఏదో ఆవిడ వాచీ నేను పెట్టుకున్నట్టు ....ఇదేం టైం అడగటం రా బాబూ..అన్నాడు శీను గాడు మెలితిరిగిన చెయ్యిని సరిచేసుకుంటూ.


'మిగతా హడావిడి లో పడి పెళ్ళి ముహూర్తం టైం మర్చిపోతారేమో అని ఇలాంటి పని ఒకళ్ళకి అప్పచెబుతారు పెళ్ళిళ్ళలో ' నాకు తెలిసింది కొంత.. తెలీంది కొంత కలిపి చెప్పా..


చాలాకాలం తర్వాత పూర్తి పల్లెటూరి వాతావరణంలో సాంప్రదాయంగా కొబ్బరాకుల పందిరిలో జరుగుతున్న పెళ్ళి చూస్తున్నాను..ఈ భోజనాలు, బందువుల డావిడి..కొద్ది దూరంలో పందిర్లో అప్పుడే మొదలెట్టిన భజంత్రీలు...మన్సులో ఒక తెలీని ఆనందం.


'ఏరా శీనుగా మాకు పప్పన్నం ఎప్పుడెడతావ్రా'..అన్నాడు అప్పుడే సుష్టుగా భోజనం చేసొచ్చి బ్రేవ్ మని తేలుస్తూ ఓ పెద్దాయన.


అలా తోటలో ఓ నాలుగు రౌండ్లు తిరిగి రండి..మళ్ళీ మాతో పాటూ తిందిరిగాని...నా పప్పు అంతా మీకే.. అన్నాడు మా శీను గాడు ఇకిలిస్తూ.. శీనుగాడి వీపుమీద నాలుగు దెబ్బలేసి పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడాయన.


నిజంగా పల్లెటూర్లలో ఉండటం ఒక వరం...ఆ ఆప్యాయతలు, పలకరింపులు...సరదా సరదా వెటకారాలూ..ఓహ్ నిజం గా నేను ఇవ్వన్నీ మిస్ అవుతున్నా రా....మీకు మాత్రం పల్లెల్లో ఉండటం ఒక వరం ..అన్నాను శీను గాడితో.


'క్షవరమా...మొన్నె మా వూర్లో చేయించారా..బాగ సెట్టయ్యింది కదా ' అన్నాడు శీనుగాడు..నా వరం అనేమాట క్షవరం గా అర్ధమచేసుకుని..


నవ్వాలో ఏడవాలో తెలీక 'తలపట్టుకుని ' కూర్చున్నా నేను.


ఇందాక టైం అడిగినావిడ మళ్ళీ భోజనాల్లోంచి హడావిడిగా బయటకు రావడం చూసి "రేయ్ ఇవ్వాళ నా చెయ్యి కి బ్యాడ్ టైం లా వుంది" అని వాచీ తీసేసి జేబులో పెట్టుకుని "ఎనిమిందింపావు" అని గట్టిగా అరిచాడు మా వాడు.


అంతే... భోజనాలు జరిగేచోట ఒక్కసారిగా కలకలం రేగింది..ఆడాళ్ళందరూ ఎక్కడివక్కడ వదిలేసి పెళ్ళింటివైపు పరుగులు పెట్టడం మొదలెట్టారు. కొందరు "అయ్యో అయ్యో ..ఎనిమిదింపావంట తొందరగా తెమలండి" అని కగారుపెట్టేస్తున్నారు మిగతావాళ్ళను.


చూసావు రా..పెళ్ళి అంటే ఇలా ఉండాలి..ముహూర్తం దగ్గర పడుతుందని అందరూ ఎలా హడావిడి పడుతున్నారో చూసావా...అదే సిటీస్ లో అయితే శుభ్రంగా తినేసి పెళ్ళికొడుక్కో షేక్ హాండ్ పడేసి పోవటమే...అన్నాను.


"కానీ పెళ్ళి రాత్రి పదిన్నరకి రా...అయినా ఉండు ఇప్పుడే వస్తా " అంటూ అక్కడ పరిగెడుతున్న ఆడాళ్ళకి అడ్డంగా పరిగెట్టి ఒక చిన్నపిల్లని పట్టి తీసుకొచ్హేడు శీను గాడు.


పెళ్ళి ఎన్నింటికి ? అడిగాడు ...ఏమోనండీ... నాకు తెలీదండీ..నేను వెళ్ళాలండీ.. అని తుర్రుమంది ఆ పిల్ల.


సరే మనమే చూద్దాం పదరా...ఒకవేళ పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమాలు ఏమైనా వున్నాయేమో...అలాంటివి అస్సల్లు మిస్ అవ్వకూడదు..పద అని వాడిని బయల్దేరదీసి పెళ్ళింటికి వెళ్ళాం.


ఇంటిముందు పందిరిలో ఎవరూ లేరు...ఇంటి హాలు మాత్రం హౌస్ ఫుల్....


ఏం జరుగ్తోందండీ....టెన్షన్ తట్టుకోలేఖ గుమ్మంలో ట్యూబ్ లైట్లు కడుతున్న ఒకతన్ని అడిగేను..


అతను చెప్పే లోగా ...'మొగలి రేకులు...మొగలి రేకులు ' అంటూ టీవీలో పాటమొదలయ్యింది...


పదే పదే ఆవిడ టైం ఎందుకడిగిందో అర్థమయ్యి ..మైండు బ్లాకయ్యి..కళ్ళలో రక్తం కారుతుండగా...నిశ్శబ్ధంగా మళ్ళీ భోజనాలు జరిగే చోటుకు చేరుకున్నాం.


ఈసారి కష్టపడకుండానే శీనుగాడు రెండు కుర్చీలు సంపాయించాడు..మాదే చివర రౌండనుకుంటా పెద్దగా ఎవరూ లేరు..వడ్డన మొదలయ్యింది..వంటలు రుచిగాఉన్నాయ్..అందరూ బాటింగ్ బాగా చేస్తున్నారు...పావుంగంటయ్యింతర్వాత కొంత మంది ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు...మా శీనుగాడికి, "వంకాయ్ జీడిపప్పు" వడ్డించేవాడికి హోరాహోరీ పోరు చివరిదాకా రసవత్తరంగా సాగి చివరకు వడ్డించేవాడు విరక్తితో ఉరేసుకునేదాకా వెళ్ళటంతో ముగిసింది...


తర్వాత ఆకులో మిగిలిన కిళ్ళీ లు నములుతూ పండువెన్నెల్లో కూచుని మా 'శరత్ ' గాడి పెళ్ళి చూసి వెనక్కు బయలుదేరాం...శరత్ గాడికి విషెస్ చెప్పి బయల్దేరుతుంటే ఒక్కసారి నా..కళ్ళు మండి కళ్ళలోంచి నీళ్ళు బొట బొటా కారాయి...మా శరత్ గాడు 'నేనెందుకు కళ్ళనీళ్ళెట్టుకున్నానో తెలీక వాడు వాడు కూడా కళ్ళు తుడుచుకున్నాడు '.


అదంతా చూస్తున్న మా శీనుగాడు ఏదో అర్ధమయ్యినట్టు నా వంక చూసి...నా దగ్గర ఇంకోటుందిలే.....పద అన్నాడు..


"కట్ చేస్తే"........మరుసటిరోజు ఉదయం ఏడుగంటలు...


"పొద్దున్నే ఆ నల్లకల్లజోడేంట్రా తింగరి వెదవా " అంటోంది మా నాన్నమ్మ నన్ను చూసి...


"కనులు కనులతో కలబడితే........"


---------- సమాప్తం--------

Wednesday, December 31, 2008

ఫట్..టపక్..దడక్!

లలలల.లా........రాగాలా పల్లకిలో కోయిలమ్మా..రాలేదు ఈవేళ ఎందుకమ్మా...?
మ్హ్..నా లాప్ టాప్ పోయిందండీ..!

తెలుసు..పీడా విరగడయ్యింది.....అందుకే రాలేదు ఈవేళ కోయిలమ్మా :)

********************
పోయిందంటే...ఎవడూ కొట్టేయలేదండీ...మొన్న డిశంబరు22న సాయంత్రం 6గం.23నిమిషములకు నాచేతిలోంచి జారిపడి నేలకి కొట్టుకుని కోమాలోకి పోయింది:)


అసలీ దుర్ఘటన ఎలా జరిగింది? ఇలా జరగడానికి కారణాలేంటి? జరుగుతున్న పరిణామాలను మా ప్రతినిది రిషి ఇప్పుడు మీకు అందిస్తారు. అరెరె అలా కంగారు పడకండి..ఉత్తిత్తినే..సరదాకి.


******అసలేమిజరిగిందంటే*************

గత నెలరోజులుగా మా ప్రొజెక్ట్ లో గుండెకాయలాంటి మాడ్యూల్ ఒకదానికి పోయేకాలమొచ్చి తిక్క తిక్కగా ప్రవర్తించడం మొదలెట్టింది...దాంతో మా మేనేజర్కి పైనుంచి మొట్టికాయలుపడి బుర్రంతా సొట్టలుపడిపోయింది.అసలే అరగుండు దానిమీద సొట్టలు దాంతో మావాడికి తిక్కరేగి ప్రోజెక్ట్ లో 'ఎమర్జెన్సీ' ప్రకటించేసాడు.

మానవహక్కులు దారుణంగా హరించబడ్డాయి. కాంటీన్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళనీ, బాత్రూముల్లో వున్నోళ్ళనీ, బాల్కనీలో తిర్గుతున్నోళ్ళనీ ఎలా ఉంటే అలా తీసుకొచ్చి ఎవడి సీట్లో వాడిని కట్టి పడేసారు. మా మేనేజర్ వచ్చి జరిగినవిషయం చెప్పి సింబాలిక్ గా తన సొట్టలు పడిన బుర్ర చూపించి డిశంబర్ 22 కల్లా ప్రోజెక్ట్ కి రిపేర్లు గట్రా చేసి మామూలు స్టేజ్ కి తీసుకురాపోతే "తాట తీస్తా" అని ఇంద్ర సినిమాలో చిరంజీవి లెవెల్లో వార్నింగ్ ఇచ్చిపోయాడు.


ఆ...ఇలాంటివి ఇండియాలో బొచ్చెడు చూసాం..అనుకుని మరసటి రోజు పొద్దున్నే వచ్చి ఇంటర్నెట్ వోపెన్ చేసి "కూడలి" అని కొట్టా.."తాట తీస్తా" అని పెద్ద పెద్ద అక్షారలతో ఒక పేజ్ ప్రత్యక్షమయ్యింది. ఇందేంటబ్బా అనుకుని రమేష్గాడిని అడుగుదామని వాడి ఎక్స్టెన్షన్ కి ఫోన్ చేసా...

"అన్ని లైన్లూ డిశంబరు 22 వరకూ బిజీగా వున్నాయ్ మూసుకుని డిశంబరు 22 వరకూ ఆగి ట్రై చేయండి"

అని ఆటోమెటిక్ వాయిస్ వచ్చింది. ఇదంతా మా మేనేజర్ వెధవ పనే (మేనేజరు వెధవపనే/ మేనేజరువెధవ పనే ఇలా రెండువిధాలా చదువుకోవచ్చు) అని అర్ధమయ్యి అయినా టైం పదకొండే కదా అయ్యింది ఈలోగా చాయ్ కొడదాం అని లేచి వెనక్కి తిరిగా...అక్కడ మా మేనేజర్ నిలబడున్నాడు జేబులోంచి రిన్ సబ్బు తీసి "ఉతుకుతా" అని సైగలు చేసి చూపించాడు .


ఇహ తప్పదని నేనూ మా టీము కదనరంగంలోకి దూకి "ఆపరేషన్ అతుకుల బొంత" అనే కోడ్ నేం తో పని మొదలెట్టాం. కార్యరంగంలో దూకి స్తిరంగా వున్న కోడ్ ని ఎడా పెడా మార్చేసి పిచ్చ పిచ్చగా ప్రోగ్రాంలు రాసేసరికి కోడ్ అర్ధంకాక మా కంప్యూటర్లు వాంతులు చేసుకున్నాయి. అయినా ధైర్యంకోల్పోకుండా గూగుల్లోనూ నెట్ లోనూ అక్కడక్కాడా దొరికిన కోడ్ ని తీసుకొచ్చి మా కోడ్ లో అతికించేసి...అతికించిన ప్రతి లైనుకీ ఒక పేజీడు కామేంట్లు రాసేసి...మొత్తానికి అయ్యిందనిపించాం.


శుభదినం రానే వచ్చింది..ఆరోజు డిశంబర్ 22, సూట్కేస్ లో అడుగునెక్కడో వున్న వెంకటేశ్వరస్వామి ఫోటొ తీసి జేబులో పెట్టుకుని ఆఫీసుకు బయల్దేరా...మద్యాహ్నం 2 గంటలకి కొత్తకోడ్ ఇన్స్టాలేషను..టైం దగ్గరపడేకొద్దీ బీపీ పెరిగిపోయి కాళ్ళూ చేతులూ వంకర్లుపోతున్నాయ్...రమేష్గాడు టెన్షన్ తో తనగోర్లు ఎప్పుడో కొరికేసుకుని అవి అయిపొయాకా కనిపించిన ప్రతీవోడి గోర్లు కొరికే పన్లోవున్నాడు.

సరిగ్గా 2 అయ్యింది.

'ఏడు కొండలవాడా వేంకటారమణా...గోయిందా గోయింద ''

"ఆపదమొక్కులవాడా......... "

అని పారవస్యంతో భక్తులు రిషి,రమేష్,బాబ్,క్రిస్టోఫర్,విలియం డేవిడ్సన్లు గొంతులు చించుకుని అరుస్తుండగా ఇన్స్టాలేషను కార్యక్రమం పూర్తయ్యింది.


ఆపరేషన్ "అతుకుల బొంత" విజయవంతంగా పూర్తిచేసినందుకు ఒకడి వీపు ఇంకొకడు గోకి మా టీం అంతా పరస్పర అభినందనలు తెలుపుకున్నాం.ఈలోగా మా మేనేజర్ వొచ్చాడు...కంగ్రాట్స్ చెప్తాడేమోననుకుని అందరం వరసగా చొక్కాలు పైకెత్తి వీపులు చూపించాం, ఆయన కంగారు పడి అబ్బే ఇప్పుడుకాదు టైం లేదు..వచ్చేవారం మీటింగ్ పెట్టి తీరిగ్గా గోకుతా అని..మీకో గుడ్ న్యూస్ అన్నాడు.

'గుడ్ న్యూసా ...చెప్పండి సార్ చెప్పండి అని అందరం బాస్ చుట్టూ మూగేసాం'.

'రేపట్నుంచీ మీరు ఆఫీసుకి రానవసరం లేదు ' అని ఒక్కక్షణం ఆగి ఇంకా ఏదో చెప్పాబోయేడు.

ఇంతలో రమేష్ గాడు కిందపడి గిలగిలా తన్నుకుంటూ..'సార్ అంతమాట అనకండి సార్..నాకు 2096 వరకు EMI లు ఉన్నాయ్ సార్ అవి కట్టకపొటే బ్యాంక్ వాళ్ళు నన్ను చంపి నాకు ష్యూరిటీ ఇచ్చిన రిషి గాడిని కూడా చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు సార్...నన్ను అన్యాయం చేయకండి సార్ మేము 'రాజమండ్రిలో' కడుతున్న డబుల్బెడ్రూం ఫ్లాట్ కి 'రాబర్ట్ బ్లాంకెన్ హొర్న్ నివాస్ 'అని మీపేరే పెట్టుకుంటా సార్ ' అని ఏడవటం స్టార్ట్ చేసాడు.

మా మేనేజర్ కంగారుపడి 'రేయ్ ఆగరా నన్ను పూర్తిగా చెప్పనివ్వరా ...'అన్నాడు, అయినా రమేష్గాడు వినకపోయే సరికి నావైపు చూసి ఏదో ఒకటిచేసి వాడ్నాపరా బాబూ అన్నాడు.

నేను వెంటనే 2007 లో వుతికిన నా కర్చీఫ్ తీసి వాడి నోరునొక్కేసా...నిమిషంలో వాడు స్పృహ తప్పి పడిపోయాడు.

మా మేనేజర్ నావైపు చూసి గుడ్ జాబ్ అని చెప్పి, రేపట్నుంచి జనవరి 2 దాకా మీకు సెలవలు, రేపొక్కరోజు ఇంట్లో నుంచి లాగిన్ అయ్యి పనిచేయండి...బైదవే బయట హెవీ గా మంచు కురుస్తుంది వెళ్ళేప్పుడు జాగ్రత్త..బై అనేసి..వెళుతూ వెళుతూ రమేష్గాడి మొహం మీద కాసిన్ని నీళ్ళు జల్లిపోయాడు...


'మంచు ' అనే పదం వినపడే సరికి నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టనిపించింది..మంచంటే నాకు చాలాఇష్టం..అసలు స్నో ఎప్పుడు పడుతుందా అని వింటర్ మొదలైనప్పటినుంచీ ఎదురుచూస్తున్నాను..ఈవాల్టికి మంచుదేవుడు నన్ను కరుణించాడన్నమాట...అర్జంటుగా మంచులో దొల్లేసి డాన్సులు చేయాలనిపించింది..'


రెండునిమిషాల్లో అన్నీ సర్దేసి..రమేష్గాడి రెక్కపుచ్చుకుని ఈడ్చుకుంటూ బయటకొచ్చేసరకి ........అహా పూల వర్షం మంచు పూల వర్షం..ఆకాశానికి చుండ్రుపట్టినట్టు తెల్లగా రాలుతూ వుంది..ఎక్కడ చూసినా తెలుపే...
ఇంక ఆగలేను..అనుకుని 'ఆకాశంలో ఆశల హరివిల్లు......అనాందాలే పూచిన..' అని పాడుకుంటూ స్వర్నకమలంలో భానుప్రియలా ఎగురుకుంటూ మంచులోకి పరిగెట్టాను....రెండు అడుగులు వేసానోలేదో........


'సర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్..' ( భూమికి రెండు అడుగుల ఎత్తులో గాల్లో వున్నా..అని తెలుస్తూంది)

'దా......బ్' (అడుగు మందంలో పేరుకుపోయిన మంచుని చీల్చుకుని నేలకు కరుచు కున్నా)

'ఫట్..టపక్..దడక్' ( లాప్ టాప్ చివరిక్షణాలు..)


*************అందరికీ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు*************

Sunday, November 23, 2008

ఆ రాత్రి ఏం జరిగిందంటే ..



యూట్యూబ్ లో 'రా..ముడు కలగనలేదు జా..నకి పతి కాగలడని..' పాటచూస్తున్నాను


జయసుధ శోభన్ బాబు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కు వేస్తూ ఒకరికాలొకరు తొక్కుకోకుండా జాగ్రత్తగా నడుస్తూ పాడుతున్నారు ..మధ్య మధ్యలో జయసుధ శోభన్ బాబు ఎడమ చేతిని తన నడుమ్మీదేయించుకుని తనచేతితో శోభన్ బాబు కుడిచేతిని పైకెత్తి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంది...


రేయ్ వాచ్ మేన్ టైమెంత? ..రమేష్గాడి కేకలాంటి అరుపు పక్కరూంలోంచి.


వాచ్ మేన్ ఏంట్రా ??


వాచ్ పెట్టుకున్న మేన్ వు కాబట్టి నువ్వు వాచ్మేన్... హహహ ..టైం చెప్పు. మళ్ళీ అరిచాడు.


ఏడిసావ్..పదింపావ్..వెళ్ళి రైస్ పెట్టు పులిహోర చేద్దాం..


రేయ్ ఆ పేరెత్తితే ఇరగ్గొడతా...నువ్వు చేసేది పులిహోర కాదురా నాయనా...పులిహోర-65, కరెక్ట్ గా చెప్పాలంటే పులిహోర-365..ప్రతిరోజూ అదేతిని నా బాడీ పచ్చగా తయారయ్యింది చూడు...నీకోదణ్ణం రా ఈరోజుకి నూడిల్స్ చేద్దాం.


'సరే చావు...' అనేసి మళ్ళీ పాట చూడ్డంలో పడిపొయా.


ఈ రెండునిమిషాల్లో శొభన్ బాబు కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టున్నాడు ...జయసుధని పట్టుకుని వెనక్కి మూడడుగులు నడచి ఆగి చప్పట్ట్లుకొట్టి తిరిగి రెండడుగులు ముందుకి...


'రేయ్ చావు అంటే గుర్తుకొచ్చింది..అమెరికాలో మనవాళ్ళనే టార్గెట్ చేసి చంపుతున్నారేమో అని అనిపిస్తూందిరా ఈ మధ్య జరిగినవి చూస్తుంటే..' మళ్ళీ తగులుకున్నాడు రమేష్గాడు.
లేకపోతే ఇంతమంది ఇండియన్స్ ఉండగా మనోళ్ళకే ఎందుకు జరుగుతున్నాయ్ ఇవన్నీ...కచ్చితంగా ఏదో ఉంది.. కొంపతీసి ఏ సైకో గాడైనా మనవాళ్ళ మీద కన్నేసాడంటావా...చూపుడువేలుతో నోటిమీదకొట్టుకుంటూ అన్నాడు మళ్ళీ..


నాకు చిరాకేసి...ఒరేయ్ నువ్వు తెలిసో తెలీకో తెలుగుజాతికి ఒక మేలుచేసావ్..అదేంటంటే నువ్వు TV మీడియావైపు వెళ్ళకుండా వుండడం. లేదంటే ఇప్పుడున్న దరిద్రానికి తోడు నీలాంటివాడి చెత్త్ అనుమానాలన్నీ అరంగంటకోసారి ఎ TV99 లోనో చూపించి ఇటు అమెరికాలో బ్రతికున్న తెలుగు వాళ్ళని అటు ఇండియాలో ఉన్న వాళ్ళ పేరేంట్స్ ని అరంగంటకోసారి చంపేసేవోళ్ళు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అనుకోకుండా ఒకేసారి జరగడంవల్ల ఇంత హడావిడి అంతే..బయట తిరిగేటప్పుడు కొంచేం జాగ్రత్తగా ఉండాలి ఇంటికొచ్చి ఎవడూ ఏమీ చెయ్యడు...అంతెందుకురా మనం ఇక్కడకొచ్చిన ఇన్నాళ్ళలొ..ఎవడైనా మనవైపు చూసాడా? మన ఇంటికెవడైనా వచ్చాడా? కనీసం ఇంటి తలుపెవడైనా తట్టాడా......?


'టింగ్ టీంగ్...' డోర్ బెల్ మోగింది


'తట్టాడు...' అని బాత్రూంలోకి పరిగెట్టబొయి మనసుమార్చుకుని బాల్కనీవైపు పరిగెట్టాడు రమేష్గాడు.


ఇదే మొదటిసారి మా డోర్ బెల్ మోగటం...అదీ రాత్రి పదిన్నరకేమో నాకు తెలీకుండానే జీరో డిగ్రీ చలిలోకూడా చెమటలు పట్టేసాయ్...రమేష్గాడు బాల్కనీలోంచి జంప్ చేయడానికి పొజిషన్ తీస్కుని సిగ్నల్ గురించి నా వంక చూస్తున్నాడు... నాకు ఇంట్లోవాళ్ళందరూ వరసపెట్టి గుర్తుకొచ్చేస్తున్నారు..ఫిబ్రవరిలో ఇంటికెళడానికి టికెట్ కూడా బుక్ చేసా...


'టింగ్ టీంగ్...' మళ్ళీ మోగింది.


రమేష్గాడివైపు చూసా...రెండో బెల్ వినడంతోనే ఒకకాలు ఇటువైపు ఒకకాలు అటువైపు వేసి బాల్కనీ రెయిలింగ్ మీదకూర్చుని దూకడానికి రెడీగా ఉన్నాడు.


నేను రేపు TV9 లో కనబడతానని రాసిపెట్టినట్టుంది...ధైర్యే సాహసే ఎంకటలక్ష్మి అని మనసులో గట్టిగా అనుకుని మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి తలుపుకున్న గాజు కన్నంలోంచి చూసా...జీవితంలో మొదటిసారి వెన్నులోంచి చలిపుట్టడమంటే ఏంటో అనుభవంలోకొచ్చింది..


ఎవడొ నల్లడ్రస్సు వేసుకుని మొహానికి పుఱ్ఱె టైపు మాస్కు పెట్టుకుని నుంచుని వున్నాడు.


రమేష్గాడు చెప్పింది నిజమే ఎవడో సైకోగాడు నిజంగానే కన్నేసినట్టున్నాడు...భగవంతుడా ఇంతబతుకూ బతికి ఇవాళ ఇలా వీడి చేతిలో...ఏడుపొచ్చేస్తూందొకపక్క..ఏదొకటిచేయాలి అనుకుంటూ మొబైల్ బయటకు తీసా...


'టింగ్ టీంగ్...' మళ్ళీ మోగింది...అయితె ఈసారి మాది కాదు ఎదురు ఫ్లాట్ వాళ్ళదనుకుంటా...


కన్నంలోంచి చూద్దామని కంగారులో డొర్ కి నెత్తి బాదుకుని పెద్ద సవుండొచ్చింది..ఎదురింటి గుమ్మం ముందునుంచున్న సైకోగాడు వెనక్కి తిరిగి చూసాడు...


అయిపోయింది ..అంతా అయిపోయింది ఇంట్లొ మనుషులుండీ తలుపు తీయలేదని వాడికి తెలిసిపోయింది...గోయిందా గోయిందా...కన్నంలోంచి అంత కంగారుగా చూడకపోతే చస్తానా..ఇప్పుడు చూసినందుకే చచ్చేలావున్నాను ...ఇదంతా నా దురద్రుష్టం...అనుకుంటుంటే అధ్రుష్టలక్ష్మి ఎదురింటావిడ రూపంలో వాళ్ళ తలుపు తెరిచింది...


పొడిచేసాడు...పొడిచేసాడు...అనుకున్నా,


ఆశ్చర్యం.... ఆవిడ బయటకు రావడంతోనే 'వొహ్హొ వొహ్హొ అని అనందం గా కేకలేసుకుంటూ వాడితో రెండుసార్లు గెంతి వాడిదగ్గరున్న బ్యాగులో ఏవో పడేసింది...ఏదో మాట్లాడుకున్నారు నాకేమీ వినపళ్ళా..


భయపడనవసరం లేదు,వీడు సైకోగాడు కాదు... ఇంక నాకు ధైర్యం ఎగదన్నుకొచ్చేసి తలుపు తీసి ఏంటి హడావిడి అన్నట్టు చూసా వాళ్ళవైపు.



'హాలోవీన్ డే ' అందామె...


ఊఊప్స్ ...ఇవ్వాళ ఇదోకటుందనే మర్చిపోయా....ఈరోజు చిన్నపిల్లలు రకరకాల డ్రస్సులు గట్రా వేసుకుని ఇంటింటికీ వొస్తారు చాక్లేట్లు గట్రా ఇవ్వాలి అని మా బాసు మొన్నెప్పుడో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది...వీడు చూస్తే చిన్నపిల్లాడిలా కాదు చిన్న సైజు డైనోసార్ లా వున్నాడు...ఇంట్లో కొన్ని చాక్లెట్స్ వున్నట్టు గుర్తు ....చూద్దాం అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి.............................


'చివరిక్షణంలో ఉరిశిక్ష తప్పించుకున్న వాడిలా' కళ్ళల్లో నీళ్ళతో రమేష్గాడు..


(ఇక్కడ హాలోవీన్ డే రోజున జరిగిన చిన్న అనుభవానికి రంగులద్ది....)

Friday, October 24, 2008

ఇంగ్లీష్ జులుం నశించాలి

ప్రతీఒక్కరి జీవితంలో 'చీ వెధవ జీవితం' 'వెధవ బ్రతుకు ' ...అనుకునే సందర్భం ఒక్కసారన్నా ఎదురవుతుందనుకుంటా. నాకు ఈమధ్య ప్రతీ రోజూ ఎదురవుతూ ఉంది అమ్రికాలో, అదీ ఇంగ్లీషు వల్ల..:(


మొన్న ఒక పని మీద లోకల్ కౌన్సిల్ ఆఫీస్కెళ్ళి ...అక్కడ కౌంటర్లో ఉన్న పిట్ట దగ్గరకెళ్ళి నా ఆంగ్లభాషాపాండిత్యాన్నంతా రంగరించి ఎందుకొచ్చానో చెప్పా...మియాం మియాం..బౌ బౌ..కావ్ కావ్ అని చేతిలో పెన్ను గాల్లో తిప్పుతూ 2 నిమిషాల పాటూ ఏదో చెప్పింది. ఒక్కముక్కా అర్దంకాలా...దాసరి అరుణ్ కుమార్ లా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషనూ లేకుండా అక్కడే నిల్చున్నా. అంతే ..'చీ నిన్ను తగలెయ్య...పొద్దున్నే నువ్వు దాపురించేవేరా నా ఖర్మకి ' టైపులో ఒక చూపుచూసి విసురుగాలేసి పక్కరూంలోకెళ్ళి ఒక అప్ప్లికేషను తెచ్చి నా ముందుపడేసింది.

హమ్మయ్యా.. అనుకుని అప్ప్లికేషన్లో ఉన్న 'నీ ముందు పేరు, ఎనక పేరు, ఎప్పుడు పుట్టావ్, ఏ రాశి, ఎందుకొచ్చావ్, ఎప్పుడుపోతావ్' లాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసేసి ...ఇంటర్ ఇంగ్లీష్ ఎక్జాం పేపర్ అరంగంటలో పూర్తిచేసిన వీరుడిలా పిట్ట దగ్గరకెళ్ళి నుంచున్నా. ఇంతకముందు జరిగిన అనుభవంతో జాగర్తపడిందనుకుంటా మాట్టాడకుండా అప్ప్లికేషన్ తీసుకుని సీట్లోంచి లేసొచ్చి నన్ను దగ్గరుండి నడిపించుకెళ్ళి పక్కనేఉన్న గదిలో ఒక బల్లమీద కూర్చోపెట్టి 'నీకో నమస్కారం రా నాయనా' అన్నట్టు ఒక నవ్వునవ్వి వెళ్ళిపోయింది.

ఆల్రెడీ అక్కడ ఇద్దరాడోళ్ళు,ఒక ముసలాయన కూర్చునున్నారు. ఓహో ఇక్కడ కూర్చుంటే వాళ్ళే వచ్చి పిలుస్తారన్నమాట ...అక్కడే చతికిలపడి ఇద్దారాడోళ్ళవంకా చూస్తూ కుర్చున్నా. ఇంతలో లొపల్నుంచి ఒక తెల్లదొరొచ్చి 'వ్ష్హ్ బుస్ష్హ్' అని ఏదో కూసాడు. వెంటనే ఇద్దరాడోళ్ళూ రెస్పాండయ్యి వాడితో లోపలకి పోయారు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాడొచ్చి 'అరే చీ..అరేచీ' అని ఎదో కూసాడు. నేను ముసలాడొంక చూసా...నిన్నే పిలుస్తున్నారన్న టైపులో . ముసలాడు కదల్లేదు. ఎవడూ కదలక పోయేసరికి తెల్లదొర 'ఉఫ్ఫ్' అనుకుంటూ లోపల్కి పోయాడు. 2 నిమిషాల తర్వాత ఆ ఇద్దరాడోల్లు బయటకొచ్చి ముసలాణ్ణి తీసుకుని వెళ్ళిపోయారు.

హమ్మనీ ...కొంపదీసి ఇందాక తెల్లదొర పిలిచింది నన్నేనా?

ధైర్యం చేసి తలుపు కొట్టి ..తెల్లదొర రూంలోకెళ్ళా..

'ఏంటన్నట్టు చూసాడు '

'మరేమోనండీ..నేను రిషి అండీ..అప్ప్లికేషనండీ' అని వాడికి ఇంగ్లీషులో కొన్ని క్లూలు ఇచ్చేసరికి...అప్లికేషన్ తీసి నాకు చూపించి ఇదేనా అన్నాడు.


'ఎస్...ఎక్జాట్లీ' అన్నా..


దాంతో తెల్లదొరకి కాలిపోయి..'ఇందాక బయట అన్నిసార్లు 'అరెచీ అరెచీ' అని కేకలు పెట్టినా నీకు అర్దం కాలేదారా ..

ఏ వూర్రా మీది ..ఎర్రబస్సెక్కోచ్చేవా అమ్రికాకి..' నవ్వుతూ చెప్తున్నట్టు నటిస్తూ ఏకి పారేసాడు.

దెబ్బకి అవమానభారంతో మనిషిని కావడానికి చాలారోజులు పట్టింది. అయినా రిషి అన్న నాపేరుని వంగడదీసి నాలుగుగుద్దులు గుద్ది పీక కోసి 'అరెచీ' అంటే నాకు మాత్రం ఎట్టా తెలుస్తుందండీ వాడు నన్నే పిలిచాడనీ. అసలు ఈ ఇంగ్లీష్తో వచ్చిన చిక్కే ఇది..దేనినైనా మొదట ఎలా పలకాలో తెలీదు..తెలిసినా స్పెల్లింగ్ పూర్తిగా వచ్చి చావదు...ఈ రెండూ తెలిస్తే ఆ పదాన్ని ఎక్కడ ప్రయోగించి చావాలో అర్దమవ్వేలోపు ఈ నేర్చుకున్న పదం కాస్తా మర్చిపోతాను. తలకి చుండ్రు పట్టినట్టు చిన్నప్పుడు నాలుగో తరగతి చదివేటప్పుడు తగులుకుంది నాకు ఈ ఇంగ్లీషు ఫోభియా.

ఓం ప్రధమం అని ABCDలు మొదలెట్టినప్పుడే పేద్ద కంఫ్యూజన్...ఓకటో బరి, రెండో బరి,మూడోబరి,నాల్గో బరి....ఒకే భాషకి ఇన్ని వర్షన్లేంటో అర్ధమయ్యేదికాదు.మరి మన 'అ,ఆ'ల కేంటి ఇన్ని బర్లు లేవు అని అడిగితే చితకబాదేసెరోరోజు మా ఇంగ్లీష్ మేష్టారు. అప్పట్నుంచీ నాకు ఇంగ్లీషంటేనే చిరాకు, అసహ్యం.....నిజం చెప్పాలంటే భయం.
ఏవో తిప్పలు పడి, పిల్లి మొగ్గలేసి...అప్పటికి గండం గట్టెక్కినా..ఐదో కళాసునుంచి ఇంగ్లీషు మరింత ప్రతాపం చూపించడం మొదలెట్టింది. రామ కిల్డ్ రావణ, రావణ కిల్డ్ బై రామ...చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుతార్రా వెధవల్లార్రా అనుకునేవాడిని. ఇహ ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలు...అన్ని సబ్జెక్ట్లూ రుబ్బుడే రుబ్బుడు. ఇంగ్లీషు మేష్టారైతే ఒక్కోక్కడి గొంతూ పెగల్దీసి ఇంగ్లీషు పుస్తకాలు కూరేసేవోడు...రోజుకొకడిని టార్గెట్ చేసి మరీ బాదేయడమే. నన్నుకూడా ఓరోజు టార్గెట్ చేసి 'ఎంప్టీ గ్లాస్ ' స్పెల్లింగ్ రాయరా అంటే 'M.T గ్లాస్ ' అని రాసా, గదంతా పరుగులుపెట్టించి మరీ కొట్టేడు. ఇంగ్లీషు పంతుల్ని నక్సలైట్లు చంపెత్తే బావుండు అనిపించేది.

ఇదంతా ఒక ఎత్తైతే మా తాతగారి గోల ఇంకో ఎత్తు. ఆయన నాకు..నేను ఆయనకి అచ్చ తెలుగులో 15 పైసల కార్డుమీద వుత్తరాలు రాసుకునేవాళ్ళం..ప్రాణం సుఖంగా ఉండేది.నాకు ఇంగ్లీష్ మీద ఇంటెరెష్టు పెరుగుతుందనికాబోసు 'ఇంగ్లీషులో' వుత్తరం రాయమని ఒకటే గోల. అది పడలేక మన 'లేఖిని 'లో తెలుగు ఇంగ్లీషులో టైప్ చేసినట్టు నేను అచ్చ తెలుగుని ఇంగ్లీష్లో రాసి కార్డు పోస్టుచేసా. ఆ ఆనందం (?) తట్టుకోలేక ఆ సంవత్సరమే పెన్షనూ గట్రా మా నాన్నమ్మకి ట్రాన్స్ఫర్ చేసి టపీ మన్నారు.

తర్వాతర్వాత తెలుగుమీడియం చదువులు...ఇంగ్లీషుకి మాత్రం ఎదో మాష్టారి కాళ్ళు పట్టుకోడం... అలా డిగ్రీ దాకా నెట్టుకొచ్చేసా.తర్వాత అంతరిక్షంలో గ్రహాల కదలికల్లో ఎదో తేడా జరిగి నాకు MCA లో రాంక్ రావడం హైదరాబాదు వెళ్ళీ JNTU లో జాయినవ్వడం జరిగింది. ఇంగ్లీషు కష్టాలు మళ్ళీ మొదల్లయ్యాయ్.కాలేజీలో సీనియర్లు తెలుగులో కుళ్ళుజోకులేసుకుంటూ మాతో మాత్రం 'టెంగ్లీష్' లోనే మాట్లాడేవారు. నాకు తిక్కరేగిపోయేది..దానికితోడు మా క్లాసులోకూడ కొంతమంది తెలుగు 0.5% ఇంగ్లీషు 80% హైదరబాదీ హిందీ 19.5% మిక్స్ చేసి హింగిలీషు మాట్లేడేవోరు. నేను నాలాంటి 'వాజమ్మ ' బాచ్ ని ఒకటి తయారుచేసి వాళ్ళతోనే గడిపేవాడిని.సీనియర్లు రాసుకురమ్మన్న 'CV' ని తెలుగులో రాసానని ..ఆరోజునుంచీ ప్రతీదీ తెలుగులోనే మాట్లాడాలని సర్క్యులర్ జారీ చేసారు సీనియర్సు, 'హలో సార్ ' కి 'ప్రణామం ఆచార్యా' టైపన్నమాట . ఇంగ్లీష్ కానిదేదైనా మనకి వాకే.

ఇక చివరి సంవత్సరం కాంపస్ ఇంటర్వ్యూ ల టైంకి మన 'హింగ్లీష్' పిచ్చి ( భయం ) బాగా ముదిరిపోయి..రోజూ పిడివేసే 'టెల్ మీ అబవుట్ యువర్ సెల్ఫ్' కూడా గుర్తుండేది కాదు. కాంపస్ సెలెక్షన్లో చచ్చీ చెడీ అన్ని రౌండులూ దాటినా... హెచ్చార్ (H.R)రౌండ్లో జెల్ల పడేది. ఒక హెచ్చార్ రౌండులో 'ఇంటర్లో' అన్ని తక్కువమార్కులెందుకొచ్చాయిరా అన్నప్రశ్నకి జవాబు తెలుగులో తెలిసినా ఇంగ్లీష్లో తర్జుమా చేసే కెపాసిటీ లేక 'టెల్ మీ అబవుట్ యువర్ సెల్ఫ్' నే మళ్ళీ అప్పచెప్పేసరికి ఇంటర్వ్యూవర్ పిచ్చి పిచ్చి గా కేకలు పెడుతూ వరండా అంతా పరుగులుపెట్టాడు.

అసలు కామెడి 'సత్యం' ఇంటెర్వ్యూలో జరిగింది.....నేను రాత పరీక్షా గట్రా దాటి 'గ్రూప్ డిస్కషన్ ' కి సెలక్ట్ అయ్యాను. నేనేంటి గ్రూప్ డిస్కషనేంటి నాకే నవ్వొచ్చింది. వెంటనే తిరిగి రూంకొచ్చేద్దాం అనుకుంటే మా 'వాజమ్మ ' బ్యాచు బలవంతంగా ముందుకు తోసారు. గ్రూప్ డిస్కషన్ లో నలుగురు నలుగురు గా విడదీసి ఎవరికీ అర్ధం కాని ఒక టాపిక్ ఇచ్చి 'ఉస్కో' అన్నారు. నేను తప్ప అందరూ దిస్కషన్ పేరుతో జుట్టూ జుట్టూ పట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోయారు, నేను నా జుత్తు నేనే పీక్కోని బయటకొచ్చేసా.

తర్వాత గ్రహాల కదలికలో మళ్ళీ అదే తేడా జరిగి ..మరియూ ఒకానొక సాఫ్ట్వేర్ కంపనీ తలరాత బాగుండక నాకు జాబుదొరికింది. జాబులో జాయినయ్యాకా ఇంగ్లీషు కష్టాలు కి ఇక లొంగిపోవడమేగానీ తప్పించుకుపోలేం అని అర్ధమయ్యి 'ఎస్, నో, ఆల్రైట్' తరహాలో కాలం గడిపేస్తున్నా....కాలాక్రమంలో 'యో మ్యాన్...యో యో', 'కూల్ బడీ' లాంటి పదప్రయోగాలూ నేర్చుకున్నా.

ఇంతకీ..ఇంగ్లీషు అంటే అంత భయమున్నవాడివి అమ్రికా ఎందుకెళ్ళావురా అంటారా.... అంతా గ్రహాల మహత్యం మా కంపనీ తలరాత బాబూ :)

అయినా అమ్రికా డాలర్లు చేగోడీలంత రుచిగా ఉంటాయ్..తెలీందేముందీ..

Tuesday, September 23, 2008

అమెరికాలో...'కడుపు మంట '


"హేయ్ రిషీ...ఈరోజు రాత్రి నువ్వూ రమేష్ మా ఇంటికి రావాలి..సరదాగా అందరం కల్సి డిన్నర్ చేద్దాం...
మా వైఫ్ కి అల్ల్రెడీ చెప్పేసా..సొ బి రెడీ బై సిక్స్, ఐ విల్ కం న్ పిక్ యు గైస్ "

సముద్రంలో అలలు వువ్వెత్తున ఎగసి పడ్డాయ్..అగ్నిపర్వతాలు బద్దలయ్యాయ్...చరిత్రలో ఒక మహాఘట్టం ఆవిష్కరించబడింది..

మా బాసు.. నన్నూ మా తింగరోడిని ఇంటికి బోజనానికి పిల్చాడు...అహ నా పెళ్ళంట సినిమాలో కోటా కి ప్రతిరూపం లాంటి మా బాసు ...మా ఇద్దర్నీ ఇంటికి బొజనానికి పిలవటమే కాకుండా..వచ్చి పికప్ చేసుకుంటానన్నాడు..కలా నిజమా.!!!

డిన్నర్ పార్టీ కి కారణం తెలీదు ...తెలుసుకోవాలని కూడా అనిపించలేదు..రోజూ కిచెన్లో నేను చేసే ప్రయోగం మా రమేష్గాడి మీదా...ఆ తింగరోడు చేసే ప్రయోగం నా మీదా పరీక్షించుకుని చివరగా బ్రెడ్డో బన్నో తినడం అలవాటైపోయింది.

మా బాస్ నొట్లోంచి వచ్చిన ఆ అమృతం లాంటి మాట విన్నప్పటినుంచి...కిచెన్ లో కుళ్ళాయి లీక్ అయినట్టు..ఆనందంతో పది నిమిషాలకొకసారి నా కళ్ళల్లో నీళ్ళు కారుతూనే ఉన్నాయి.

అమెరికా వచ్చి నాలుగు నెలలయ్యింది... ఒక్కసారైనా ఇంటికి పిలిచి కనీసం ఓ అరకప్పు టీ కూడా ఇవ్వలేదు వెదవ అని నిద్రలో కూడా తిట్టుకునేది..ఇలాంటి మంచి మనిషినా ? నా మీద నాకే చాలా కోపం వచ్చింది.
అవున్లే ఇంటికిపిలిచి టీ కాఫీలు ఇవ్వటానికి మనం ఏమైనా..మేనేజర్లా ? ఆఫ్టరాల్ తొక్కలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లం...నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.

ఏ పనీ చెయ్యబుద్దికావడం లేదు....కీ బోర్డూ మవుసూ వంక చూస్తే... చికెనూ మటనూ..రొయ్యలూ చేపలూ అందంగా పింగాణీ ప్లేటుల్లో సర్దిపెట్టినట్టుగా కనిపిస్తున్నాయ్...

కొద్దిగా తేరుకుని ...రమేష్ గాడి క్యూబికల్ కి వెళ్ళి చూసా..సీట్లో లేడు...డౌటొచ్చి బెంచీ కింద చూసా..కింద కూర్చొని పిచ్చి పిచ్చి గా వాడిలో వాడే నవ్వుకుంటున్నాడు...మనిషి కొద్దిగా సున్నితం ఇలాంటి షాకులు తట్టుకోలేడు.

మొహం మీద నీళ్ళు చల్లి ....లేపి కూర్చీలో కూర్చోబెట్టాను...

'ఓరెయ్ రిషిగా..బాసూ..భొజనం..అంటూ ఏడుస్తూ కౌగిలించుకున్నాడు...'

............................

లంచ్ చేస్తున్నప్పుడూ అదే ద్యాస ...లంచ్ బాక్సులో ఉన్న రెండు బ్రెడ్డు ముక్కల్ని కసితీరా కొరికి..ఈ రోజు రాత్రికి నిన్ను ముట్టుకోను..బతికిపోయావ్ పో..అనుకున్నా.
'ఓరెయ్ రిషిగా..రోజూ ఈ కోడిగుడ్లు తినీ తినీ ..ఏదో ఓ రోజు నువ్వూ నేనూ తలా ఓ గుడ్డూ పెట్టేలా ఉన్నాం రా...రాక రాక చాన్సొచ్చింది.. ఈరోజు బాసుగాడింట్లో మన బాటింగ్ అదిరిపోవాలి...నేను మాత్రం మొత్తం ఓవర్లు ఆడితే గానీ బాటింగ్ ఆపను.. ' అన్నాడు బాయిల్డ్ గుడ్డొకటి బుగ్గనేసుకుని మా రమేష్ గాడు.

ఈరోజు ఫ్రైడే అన్న ఆనందం ఒక వైపు ...రాత్రి బాసు ఇంట్లో జరగబోయె డిన్నర్ ద్రుశ్యాలు మరో వైపు మనసుని కితకితలు పెడుతుంటే....సాయంత్రం 4 కల్లా ఆఫీస్లోంచి చెక్కేసి...రూం లో

'గాల్లో తేలినట్టుందే....
గుండె జారినట్టుందె...
ఫుల్లూ బాటిలెత్తి...దించకుండా తాగినట్టుందె '

అని ఓ పావుగంట..నేను రమెష్ గాడూ స్టెప్పులేసుకున్నాం.

గంటలో రెడీ అయిపోయి...పాడ్లు కట్టుకుని ఫీల్డులోకి ఎంటర్ అవడానికి సిద్దంగా ఉన్న గౌతం గంభీరూ సెహ్వాగ్ జంటలా..నేనూ రమెష్ గాడూ బాల్కనీ లో కూర్చుని..వచ్చీ పోయె కారుల్లో మా బాసు గాడి కారు ఉందేమో అని చూస్తూ ఉన్నాం.

వచ్చేసాడు..మా బాసు. కంగారులో బాల్కనీ లోంచి దూకడానికి రెడీ గా ఉన్న రమేష్ గాడిని వారించి కిందకి నడిచి వెళ్ళి కార్లో ఫ్రంట్ సీట్లోకి మా తింగరోడిని తోసి నేను బ్యాక్ సీట్లో కూర్చున్నా..

'రై ..రై...' అరిచాడు మా రమేష్ గాడు.

కారు బాగానే నడుపుతున్నాడు మా గురువు...

'వాట్స్ అప్ గైస్ ...అవునూ మీరు రూం లో వంట చేస్కుంటారా ?' అడిగాడు మా బాస్.
'కటింగ్ సెక్షన్ నాది...' గొప్పగా చెప్పాడు మా తింగరోడు.
'ఓహ్..గుడ్...సొ వుల్లిపాయలు నువ్వు కట్ చేస్తే..రిషి వంట చేస్తాడన్నమాట ' అన్నాడు బాసు.
'కరెక్టు గా అన్నీ కట్ చేసి ఇస్తే..వంట చాలా ఈజీ సార్ ...మనం కటింగ్ సెక్షన్ లో కింగు ఏదైనా చిటికెలో తరిగి ఇచ్చెస్తా ' స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్ లా చెప్పాడు మా వోడు.

'ఓహ్..గుడ్ గుడ్...' రమేష్ గాడి వంక చూసి ఓ నవ్వు నవ్వాడు మా బాసు.

అప్రైసల్ లో 5 కి 5 రేటింగ్ వచ్చిన వాడిలా..వెనక్కి తిరిగి చూసావా మన గొప్పతనం అన్నట్టు కళ్ళెగరేసాడు..మా తింగరోడు.


కార్ పార్క్ చేసి...ఇంట్లోకి తీసుకెళ్ళాడు మా బాస్.

'ఉమా ..హీ ఈస్ రిషి న్ హీ ఈస్ రమేష్....' వాళ్ళావిడకి పరిచయం చెసాడు.

'హలో బావున్నారా..ఈయన ఎప్పుడూ మీగురించే చెబుతూ ఉంటారు...అలా సోఫాలో కూర్చోండి..'

' ఏవండీ డిన్నర్ చేసేస్తారా ...ఇంకా వద్దు అంటే ఈలోపులో టీ ఇస్తాను ...రిషీ టీ తాగుతావా...లేక కాఫీనా ?'

రమేష్ గాడు ఇవేవీ పట్టిచ్చుకోకుండా..కిచెన్ వైపు చూస్తూ...కుక్క టైపులో ముక్కుతో వాసన చూస్తూ ఏం కూరలు వండారో అని గెస్ చేస్తున్నాడు '

'ఏనీ తింగ్ వోకే అండీ..' అన్నా...


ఎంత ఆప్యాయత..ఎంతా కలుపుగోలుతనం..నాకు 'సంక్రాంతి ' సినిమా చూస్తునట్టుగా ఉంది...మా బాసూ వాళ్ళావిడా సంక్రాంతి సినిమాలో వెంకటేషూ స్నేహా లాగా కనిపిస్తున్నారు...నా కళ్ళకి.

'ఓరెయ్ రిషీ..నాన్ వెజ్ లేదేమోరా...' స్మెల్ ఏం రావడం లేదు..చెవిలో గొణిగాడు రమేష్ గాడు.

చస్..నోర్మూసుకుని కూర్చో... నా అన్నా వదినలని ఒక్కమాటన్నా నేను ఊరుకోను.

'అన్నా వదినలేంట్రా ' కన్ఫ్యూస్ గా అడిగాడు రమేష్గాడు.

'ఇప్పుడే డిసైడయ్యా...మన బాసూ ఉమా గారూ..ఈరోజు నుంచీ మనకి పెద్దన్నయ్య వదిన టైపు...'

అర్దమయ్యీ అర్దంకానట్టు చూసాడు రమేష్ గాడు.

టీలు తాగి...టీవీలో కార్టూన్ షో చూసాకా...
ఇంక డిన్నర్ స్టార్ట్ చేద్దం అన్నారు మా వదిన. :)

మూతలు పెట్టిన గిన్నెలు టేబుల్ మీద పెడుతుంటే....వాటివంక కళ్ళర్పకుండా చూస్తున్నాడు మా రమేష్ గాడు.

'కమాన్ రమేష్....ఫీల్ ఫ్రీ' అని మా రమేష్ గాడిని ముందుకు తోసాడు మా బాసు.

అంతే వుసేన్ బోల్టు కి తాతలా పరిగెట్టి ప్లేటు తీస్కొని కున్ను మూసి తెరిచేలోపు టేబుల్ ముందున్నాడు రమేష్ గాడు.

"అన్నం, పప్పూ, సాంబారూ, ప్రియా పచ్చాడి... పెరుగూ"

ఫ్యూజు పోయిన బల్బులా ఉంది రమేష్ గాడి మొహం....నాన్వెజ్ లేదు అనే నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాదు...

చికెనూ మటనూ మాట దేవుడెరుగు...కనీసం మన టైపులో ఒక కోడిగుడ్డు కూడా లేదు ...ఇదేం దిక్కుమాలిన డిన్నర్ రా..అన్నట్టు చూసాడు నావైపు .

నాది కూడా ఇంచిమించు వాడి పరిస్తితి లాగానే ఉంది. అయినా ఉమా గారి ఆప్యాయత ముందు చికెనూ మటనూ ఒక లెక్కా అనుకుని...

'అన్నా.. వదినా...' అని రమెష్ గాడి చెవిలో గొణిగా...

'నీ బొంద '..గట్టిగా పైకే అన్నాడు మా తింగరోడు.

'కంద కాదు బాబూ ..ఇది పప్పే ' అంది మా బాసు వాళ్ళావిడ రమేష్ గాడి వంక చూసి.

మారు మాట్లాడకుండా...నా వైపు తిరిగి..ఏ పిచ్ అయితే ఏంటి...వెజ్ అయినా నాన్ వెజ్ అయినా...నా బాటింగ్ స్టైల్ మారదు..అని..బాటింగ్ మొదలెట్టాడు మా రమేష్ గాడు.

'ఈ సండే మా పాప బర్త్ డే ...' అన్నాడు మా బాసు.

'హెయ్ ...గుడ్ సార్...' అరిచాడు మా రమేషుగాడు ..ఎక్కడొ మళ్ళీ నాన్ వెజ్ ఆశ చిగురించింది వాడికి.

'ఏంటో మొన్నటి నుంచీ చూస్తున్నా...ఓ టెన్షన్ పడిపోతున్నారు..రిషీ రమేషూ ఉన్నారు కదా హెల్ప్ చేయటానికి..ఎల్లుండి పార్టీ అయ్యేదాకా ఇక్కడే ఉంటారు..ఏం రమేషూ.. ' అంటూ నా వైపు చూసింది బాసు వాళ్ళావిడ.

నాకేమూలో చిన్న అనుమానం మొదలయ్యింది....చూస్తుంటే అంతా ముందే రాసేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నట్టనిపించింది. బాసు వెదవ ఇంత సడన్ గా ఇంటికిపిలిచింది పని చేయించుకోడానికా!!!

'ఆ లేదండీ..రేపు మా కజిన్ వస్తాడు..నైట్ కి ఇంటికెళ్ళిపోవాలి ' అని చెపుదామనుకొనే లోపే...మా తింగరోడు కొంపముంచేసాడు.

'ష్యూర్ ..విత్ ప్లెసర్ ...అయినా మాకు వీకెండ్ లో ఏం పన్లుంటాయండీ..కాలేజ్ డేస్ లో రోజుకో బర్త్ డే పార్టీ చేసే వాళ్ళం..' నాన్ వెజ్ ఆశతో నోటికొచ్చినట్టల్లా వాగేసాడు రమేషు గాడు.

'ఒరేయ్ రమేషూ అదికాదురా...రేపు మా కజిన్ వస్తాడు కదరా' అన్నా...ఈ డైలాగ్ కి రమేష్ గాడు నావైపు తిరిగితే కన్ను కొట్టి విషయం అర్దం చేసుకోరా బాబూ అందామని నా అయిడియా..

'మీ కజినా ...అమెరికాలో ఎవరున్నార్రా ' నా వంక చూడకుండా సాంబార్ కలుపుతూ అన్నాడు రమేష్..

ఓరి తింగరముండాకొడకా...కొంపముంచేవ్ కదరా అనుకుని...ఇంక చేసేదేమీలేక..
'మార్నింగ్ వస్తామండీ ' అన్నా...మా బాసుతో.

'వోకె ..నో ప్రాబ్లం మార్నింగ్ 9 కి నేనొచ్చి పికప్ చేసుకుంటా' తప్పించుకునే చాన్సే లేదన్నట్టు చెప్పాడు మా బాసు.

డిన్నర్ కార్యక్రమం పూర్తయ్యింది....మా తింగర వెదవ నాట్ అవుట్ బాట్స్ మన్ గా చివరగా..వెళ్ళి చెయ్యికడుకున్నాడు.

మా బాసు గాడు మమ్మల్ని మా రూం దగ్గర డ్రాప్ చేసి..'మార్నింగ్ 9...బీ రెడీ' అనేసి..వెళ్ళిపొయాడు.

బాసు గాడు అటు వెళ్ళగానే...రమేష్ గాడిని వంగో బెట్టి నడ్డి మీద మోచేతితో 10 సార్లు గట్టి గా గుద్ది ...మదుబాబు నవల్స్ లో షాడో విలన్ని తన్నినట్టు డొక్కలో తన్నా '

తప్పించుకుని దూరంగా పరిగెట్టి...'ఏవయ్యింది రా ?' అన్నాడు.

'ఓరెయ్ తింగరి వెదవా...భోజనం ఆశ పెట్టి మనతో బర్త్ డె పార్టీ పన్లన్నీ చేయించ్కుందామని బాసుగాడి
ప్లాను రా..నువ్వేమో తిండి చూడగానే చంద్రముఖిలాగా మారిపోయి నావంక కనీసం చూడనయినా చూడకుండా సాంబార్ తాగుతావ్ రా ...?' కోపంగా అరిచా...

'అదేంట్రా...నువ్వే కదా మా పెద్దన్నయ్యా పెద్దొదినా అన్నావ్' అందుకనే నేనూ..నసిగాడు.

'నోర్ముయ్ రా పిడత మొహం వెదవా...బర్త్ డె పార్టీ అనగానే నాన్ వెజ్ ఉంటాది...కుమ్మెద్దాం అని నీ ప్లాను..' కోపంగా అన్నా..

'ఒరేయ్ రిషిగా...ప్రతీదాన్నీ అనుమానించడం కరెక్ట్ కాదురా...బర్త్ డె పార్టీ కి పన్లంటే ...బట్టలుతకడం, గోడలకి సున్నాలు వెయడం..వాళ్ళ పాపకి స్నానం చేయించటం కాదురా...ఎదో కుర్చీలు సర్దడం, షాపింగూ...రూం కి చిన్న డెకరేషనూ అంతే..ప్రపంచంలో ఏ బర్త్ డె పార్టీకీ అంతకుమించి పని ఉండదు...' వీపు రుద్దుకుంటూ అన్నాడు రమేష్ గాడు.

నేనేమీ మాట్లాడలేదు.....

'అయినా జస్ట్ ఈ మాత్రం హెల్ప్ చేయించుకోడానికి మనల్ని ఒక రోజు ముందుగా ఇంటికి భోజనానికి బుద్దున్న ఏ వెదవా పిలవడు రా...కళ్ళుమూసుకుని రేపు బాసు గాడికి ఆ చిన్న చిన్న పనులు చేసి పెడితే ఇంచక్కా పార్టీలో చికెనూ మటనూ కుమ్మేయచ్చు ' మళ్ళీ వాడే అన్నాడు.

ఈసారి నాకూ ఎందుకో మా తింగరోడు చెప్పింది నిజమనిపించింది.

'మ్మ్మ్హ్....మే బీ యు ఆర్ రైట్ ' అన్నా...వెంటనే మా రమేష్ గాడు నన్ను వంగోబెట్టి నడ్డి మీద 15 సార్లు గుద్ది రూంలోకి పరిగెట్టాడు.

రూం లో రాత్రి జల్సా పాటలు పెట్టుకుని...రమేష్ గాడు ఒక్కడే ఓ నాలుగు స్టెప్పులేసుకుని పడుకున్నాడు...

........................................

9 కల్లా మా బాసు రావడం ...వాళ్ళ ఇంటికెళ్ళి 10 కల్లా టిఫెనూ టీ పూర్తి చేయడం జరిగిపోయాయ్...
'చూసావా..నామాట విన్నందుకు పొద్దున్నే టిఫెనూ టీ ఫ్రీ గా కొట్టేసాం' అన్నట్టు చూసాడు రమేష్ గాడు నా వంక.

'ఏవండీ కొద్దిగా వుల్లిపాయలు కోసి పెట్టరూ ...' అడిగింది మా బాసుని వాళ్ళవిడ.

'నేను ఇంకా షాపింగ్ కి వెళ్ళి అవీ ఇవీ కొనాలి...మన రమేష్ కటింగ్లో కింగు..రమేషూ కొద్దిగా హెల్ప్ చెయ్యవా' మొహమాటం లేకుండా అడిగాడు మా బాసు.

నాకు ఎగిరి గంతెయ్యాలనిపించింది....తింగరి వెదవా..నేను చెబితే విన్నావా అని మనసులో అనుకుంటూ జాలిగా చూసా మా రమేష్ గాడి వైపు.

అప్పటికే కింద నాలుగు న్యూస్ పేపర్లు పరిచి ..2 కిలోల వుల్లిపాయలు 1/2 కేజీ పచ్చిమిర్చీ ...పెద్ద అల్లం ముక్కా పడేసింది మా బాసిణి ( బాసు పెళ్ళాం)

రమేష్ గాడి మొహం లో నెత్తురు చుక్క లేదు...పిచ్చిగా గాల్లోకి చూస్తున్నాడు.

ఎందుకైనా మంచిదని...నేనూ మీతో షాపింగ్ కి వస్తా అని మా బాస్ తో అన్నా...

వోకే ...నేనూ రిషీ వన్ హవర్లో వస్తాం.....ఈలోపు ఏమైనా హెల్ప్ కావాలంటే రమేష్ ని అడుగు అని రమేష్గాడికి వినపడేలా వాళ్ళావిడతో చెప్పి కారు తీసాడు బాసు.

.............................

అర డజను షాపులు తిరిగి...అడ్డమయినవీ కొని ఇంటికి చేరేసరికి మద్యాహ్నం రెండు అయ్యింది. గుమ్మంలో అడుగుపెట్టగానే...పరిగెట్టుకొచ్చింది మా బాసు వాళ్ళావిడ.

'ఏవండీ రమేషు కళ్ళు తిరిగి పడిపోయాడు ' కంగారుగా చెప్పింది.

'ఏం ఏమయ్యింది....' అంతే కంగారుగా అడిగాం నేనూ మా బాసూ..

'ఇప్పటి దాకా బాగానే ఉన్నాడండీ ....ఇందాక మన పాపని ఎత్తుకుని తిప్పాడు కూడా...నేను సోఫా కవర్లు మార్చాలి కొద్దిగా హెల్ప్ చేయవా రమేషూ అని అడిగా ఇంతలోనే....' జరిగిన విషయం ఇదీ అన్నట్టు చెప్పింది.

సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్న రమేష్ గాడిని చూసి జాలేసింది నాకు.

'ఏరా ఎలా వుంది ఇప్పుడు ?' అడిగాను..

సమాదానం గా .....మూడోకంటికి తెలీకుండా ఒక కాగితం నా చేతిలో పెట్టాడు రమేష్ గాడు.

విప్పి చూసాను...'నన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా' అని ఉంది :)

మా తింగరోడి ప్లాన్ అర్దమయ్యింది...వెంటనే మా బాసు తో రమేష్ కి 'లో బీపీ' ఉంది అని చెప్పి...అర్జెంటుగా రూం కి వెళ్ళి మందులేసుకుని రెస్టు తీసుకుంటేగానీ మనిషి బతకడు అన్న టైపులో హడావిడి చేసేసరికి...మమ్మల్నిద్దరినీ మా రూం కి తీసుకెళ్ళి పడేసాడు మా బాసు.

.....................................

'ఇంక చాలు లెగరా......' అనేసరికి 'ఒరేయ్ రిషీ నీ రుణం జన్మ జన్మలకీ తీర్చుకోలేనురా.......' అని బావురుమన్నాడు రమెష్ గాడు.

వెక్కి వెక్కి ఏడుస్తూ...ఒరేయ్ నువ్వు నిన్న చెప్పిన మాట నిజమేరా...బాసు గాడి కూతురు బర్త్ డె పార్టీకి మనల్ని బాగా వాడుకున్నాడ్రా... అన్నాడు.

'ఏవయ్యిందిరా...జస్ట్ వుల్లిపాయలే కదా కోయమన్నారు....'

'దాని శార్దం దాని బొంద..బాసు గాడి పెళ్ళం కన్నా ..మన బాసు గాడే బెటర్ రా.....
నా జీవితం లో రోజుకి రెండు కన్నా ఎక్కువ వుల్లిపాయలు ఎప్పుడూ కొయ్యలేదురా..అలాంటిది..నాతో ఎన్ని కిలోల వుల్లిపాయలు కోయించింది రా...మీరు వెళ్ళిన తర్వాత ఇంకో కేజీ వంకాయలు కేజీ బంగాళదుంపలూ కోసిపెట్టాను.. ఒక పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి నాకు రాదని చెప్పినా వినకుండా నాతో గ్రైండర్లో ఇడ్లీ పిండి రుబ్బించింది రా...తర్వాత నువ్వు అచ్చు మా తమ్ముడిలా ఉంటావ్ అని ...ఇల్లంతా వాక్యూం క్లీనర్తో ...........' వెక్కి వెక్కి మాటలు రావడం కష్టం గా ఉంది...రమేష్ గాడికి

'ఇన్ని పన్లూ చేసి...ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందామంటే...కొద్దిగా పాపని చూస్కోవా..అని పిల్ల ముండని నాకు బవలంతం గా అంటగట్టి వెళ్ళిపోయిందిరా....అది పాప కాదురా పీపా ...ఎత్తుకునితిప్పితే గానీ అది ఏడుపాపదని అర్దమయ్యి అరంగంట ఎత్తుకుతిప్పారా...ఇంక నా వల్ల కాక కింద కూర్చోబెడితే కండ వూడిపోయేలా జబ్బ పట్టుకుని కొరికేసిందిరా........మీరొచ్చేసరికి ప్రాణాల్తో ఉంటానో ఉండనో అని ఈ డ్రామా అంతా ...' ఏడుస్తూ చెప్పాడు ...

మా తింగరోడి కష్టాలకి ....మా బాసు దంపతుల పార్టీ మేనేజ్మెంట్ అండ్ రిసోర్సు యుటిలైజేషను తెలివికి నవ్వుకుంటూ ...వాడిని వూరుకోబెట్టి...పడుకోమని చెప్పి ...నేనుకూడా మంచం మీద వాలిపోయా..

............................

ఎవరివో మాటలు గట్టిగా వినపడేసరికి....మాంచి నిద్రలో ఉన్న నేను వులిక్కిపడి లేచాను. పక్క రూంలో రమేష్ గాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు....

'ఏంటీ పార్టీ నా ?'
'వెజ్జా నాన్ వెజ్జా '...........


Friday, September 12, 2008

బెంగులూరు-చందమామ-రాజమండ్రి

2007 వ సంవత్సరం.....ఒక రోజు...

సాయంత్రం బడి అయిపోయింతర్వాత..బుద్దిగా ఇంటికెళ్ళిపోయే పిల్లాడిలా లాంగ్ వీకెండ్ కి ..మా ఇంటికెళ్ళడానికి రాజమండ్రి బండెక్కేసా...బండి కదిలింతర్వాత జరగబోయేదేంటో..నాకు బాగా తెలుసు కాబట్టి..వెంటనే నిద్దరోయా.

ఇక్కడ కొన్ని జనరల్ నాలెడ్జి కొచ్చిన్లు..

1.ఇండియా కేపిటల్ ఏది ? ఆ: డిల్లీ

2.మూడు రెళ్ళెంత ? ఆ: ఆరు

3.బెంగులూరు టు వైజాగ్ వయా రాజమండ్రి APSRTC వాల్వో బస్సులో ఏ సినిమా వేస్తారు ?

ఆ: ఆ మాత్రం తెలీదా!! చందమామ, చందమామ..చందమామ.


నా సుడి మామూలు సుడి కాదు..వట్రసుడి...ఈ సినిమా గత 10 ట్రిప్పులో 30 సార్లు చూసా...బస్సు డ్రైవర్లు, అటెండెంట్ కుర్రాడు మారతారు తప్ప చందమామ మారే ప్రసక్తే లేదు. ఆ సినిమాలో యాక్ట్ చేసినోళ్ళంతా..మా చుట్టాలు అన్నంతగా..నా నర నరాన చందమామ సినిమా జీర్నించుకుపోయింది...

..........


'ట్వింకిలి ట్వింకిలి లిట్ట్లేస్టార్...హవ్వై వండరు వా...' ఎవడో నిక్రుష్టుడి రింగ్ టోన్ చెవుల్లో పొడిచేస్తుంది..

తెల్లారింది..కిటికీలోంచి చూసా..ఇంకా రాజమండ్రి రాలా.


ఫొన్ అరుస్తూనేఉంది ...వాడి రింగ్ టొన్ దెబ్బకి బస్సులొ అందరి మత్తూ దిగిపొయింది..ఆ దరిద్రుడు మాత్రం పడుకొనేఉన్నాడు.

నా పక్కసీట్లో అతనికి 'టాంక్ '..ఫుల్ టాంక్ అయ్యిందనుకుంటా..నిండుకుండలా..బాడీ కదపకుండా తల మాత్రం తిప్పుతున్నాడు..


మళ్ళీ..జనరల్ నాలెడ్జి..

ప్రశ్న: ఒక సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలుంటాయ్ ..?

తిక్క ప్రశ్న...ఒప్పుకుంటాను..కానీ ఈ ప్రశ్న కి నాకు మాత్రమే ఆన్సర్ తెలుసు.

ఆన్సరు : ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలుంటాయ్ ...ఒకటి మామూలు సంవత్సరం..రెండోది..బెంగుళూరు నుంచి రాజమండ్రి చేరటానికి పట్టేది.

.................................

రాజమండ్రి స్టేషన్లొ బండి ఇంకా ఆగనేలేదు..నా పక్కసీటోడు..మాయం.

లగేజ్ తీస్కోని..లగేజి తీసిచ్చిన కుర్రోడికి పది పడేసి..కదిలా..

'ఇదిగో అబ్బాయ్...ఇదిగో నిన్నే..'

'ఏంటండీ...'

'నిన్ను కాదు ...ఆ రిక్షా అతన్ని..' చెప్పింది నాతోపాటే దిగిన ముసలావిడ రిక్షా వాడిని పిలుస్తూ.

దిమ్మతిరిగిపోయి .............ఏం చెయ్యాలో అర్దంకాక ...రోమింగ్ లేని నా ఫొన్ లో మా నాన్న తో మాట్లాడ్డం స్టార్ట్ చేసా.

2 నిమిషాల తర్వాత ఒక ఆటో నా ముందాగింది..

రాజమండ్రి లో ఆటో డ్రైవర్లు మాట్లాడరు...జస్ట్ మనవైపు చూస్తారు..మనమే మాట్లాడాలి.

'రంగారావ్ గారింటికి....వెళ్ళాలి ' కర్మ ...మళ్ళీ చందమామ ఎఫెక్టు..

'కాదు....పి అండ్ టి కాలని '

నిమిషం ఆలోచించి ...మెడ ఇలా ఎగరేసాడు..

నీ పిండం పెట్టా...అలా మెడ ఎగరేస్తే అర్దమేంట్రా ..మెడనెప్పా? వస్తావా? రావా?..అడుగుదామనిపించింది.

ఇంతలో వాడే...ఎక్కండి..అన్నాడు.

........ఉదయం ఎనిమిదిన్నరకి రాజమండ్రి ఇంకా నిద్రపోతూ ఉంది...చల్లగాలి...కంబాలచెర్వు కంపు...మనసు హాయి గా ఉంది.

మా వీది మొదట్లో ...చిన్న వినాయకుడి గుడి..రోడ్డుకి అడ్డంగా పెద్ద పందిరి ..అందులో 2 పెద్ద సౌండ్ బాక్సులు ...10 కుర్చీలు...ముగ్గురు పిల్లలు అందులో ఒకడికి బోసిమొల..ఇంకా ఒక పంతులు..చాలా సందడిగా ఉంది.

'జర జూము జూము...జర జూము జూము..జర జూం' ...హిమేష్ రేషిమియా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు...గుళ్ళో.

ఆటో 360 డిగ్రీల కోణంలో ..అక్కడకక్కడే రివర్స్ తిప్పేసి..ఇక్కడనుంచి నీచావు నువ్వు చావు అన్నట్టు చూసాడు నా వంక ఆటో వాడు..

దిగి ఇంటేపు నడవడం...మొదలెట్టా...

'జర జూము...' రేషిమియా ఇంకా ఏడుపు ఆపలేదు.

'చీ..హెయ్ ..హెయ్..అవతలకి పో....'
మనల్ని కాకూడదనుకుంటూ ...పక్కకి చూసా..

'డాబా వాళ్ళింట్లో ముమైత్ ఖాన్ మొక్కలు తినేస్తుంటే...బయటకు..తోలుతున్నారు.'

కొమ్ములు కిందకివంగి ఉన్న ఏ గేదైనా..నాకు ముమైత్ ఖాన్ తో సమానం.

మా ఇల్లొచ్చేసింది.....మా అపార్ట్మెంట్ కింద కుర్చీ వేసుకుని ఒక మినిస్టర్ గారు పేపర్ చదువుకుంటున్నారు....ఆయన మాకు వాచ్మేన్ అవుతారు...వాడు చేసే ఒకే ఒక్కపని జీతం తీసుకోడం. ఆయనికి డిస్ట్రబెన్సు లేకుండా....మైన్ గేటు ఎడమ కాలితో గట్టిగా తన్ని ...తిరిగి గేటు మూయకుండా పద్దతిగా మెట్లెక్కి పైకొచ్చా...

'ఇప్పుడు మనం తెలుసుకోబోయే పదకొండవ సందేహము..తిండి మానేస్తే బరువు తగ్గుతారా...అది కేవలం మన అపోహ మాత్రమే'...అదొక టైపు గొంతుక

టీవీ లో 'మంతెన సత్యనారాయన రాజు గారి కార్యక్రమం'......నాన్నమ్మ, నాన్న గారు చూస్తున్నారు.

'ఇదిగో విజయలక్ష్మీ ...రిషి గాడొచ్చేసాడు ' వంటింట్లో అమ్మకి, వీధిలో వాళ్ళకి ..అందరికీ కలిపి ఒకేసారన్నట్టు పెద్ద కేక పెట్టింది మా నాన్నమ్మ.

నాన్న....మాట్లాడలేదు గానీ..ఒక నవ్వ్వు మాత్రం నవ్వారు. బహుసా... 'మంతెన ' గారి ఎఫెక్ట్ కావచ్చు.

'ఏరా..దిగింతర్వాత ఫొన్ చెస్తే నాన్న వచ్చును కదా...స్టేషన్ కి ' -అమ్మ .

'ఆ గెడ్డం ఏంట్రా వెధవా...రిక్షా వాడిలాగ..' ప్రేమగా కుక్కపిల్లని దువ్వినట్టు చేత్తో నా తల దువ్వింది నాన్నమ్మ.

'రాత్రేమైనా..తిన్నావా...' అడిగింది మళ్ళీ

'ఆ... తిన్నా...'

'తినకు..తినకుండా..అటూ ఇటూ తిరుగు.. ...అందుకనే అలా ఈనుప్పుల్లలా ఉన్నావ్'

( మా నాన్నమ్మ సౌండ్ ఇంజనీరింగ్లో ఎమ్మే చెసింది..మనం చెప్పేది వినిపడదు )

'తిన్నాడంటండీ .....' మద్యలో కల్పించుకుంది అమ్మ.

ఇప్పుడు మళ్ళీ జనరల్ నాలెడ్జీ కార్యక్రమం...

ప్ర: 'స్రుష్టిలో తియ్యనిది....... ?
ఆ: స్నేహం,..ప్రేమ..........బూడిద,బంకమట్టి ఇవేవీ కాదు....

స్రుష్టిలో ఏదైనా తియ్యగా ఉందీ అంటే ...అది కచ్చితంగా మా అమ్మ చేసే 'టీ' మాత్రమే...దానికి తిరుగులేదు.

మా అమ్మ ఫార్ములా అలాంటిది మరి....ఒక స్పూను పాలు, 3 స్పూనుల నీళ్ళు ...6 గరిటెల పంచదార.

అమ్మా....దువ్వన ఎక్కడుంది ?

..ఆ టీవీ పక్కనుంటుంది చూడు .....

మా అమ్మ ఇచ్చిన 'ఫార్ములా' తాగి.....దువ్వెనతో నాలికని బర బరా..బరుక్కుంటూ..బాల్కనీ లో నిలబడ్డా....

బయట ఇందాకంత రణగొణలు లేవు..హిమెష్ రేషిమియా ఏడ్చి ఏడ్చీ ...నిద్రపోయినట్టున్నాడు.

'స్నానం చేసెయ్యరా..ఫ్రీ గా ఉంటాది..జర్నీ చేసావ్ కదా' - నాన్నగారు

టవల్ కట్టుకున్నాను కదా....ఫ్రీగానే ఉంది...అన్దామనిపించింది...

నాన్న వదిలినా...మా ఇంజనీరు వదలదు ...ఈ సారికి సరెండర్ అయిపోదామని .....బాత్రూంలోకి వెలుతూంటే...

'ఇదిగో రిషి గాడికి టీ ఇచ్చేవా'..మా అమ్మని అడుగుతోంది నాన్నమ్మ..

'నేను టీ మానేసాను ' .....గట్టిగా అరిచి తలుపేసుకున్నా...


...............................

స్నానం చేసి వచ్చి..మా నాన్నమ్మ పక్కన కూలబడ్డా..

బయట ఏదో హడావిడి...వినాయకుడి గుళ్ళో మళ్ళీ ఎవడిదో ఏడుపు....

'పొద్దున్లెగాలి ....స్నానం చెయాలీ..పిఎంటి కాలానీ భక్త మహాశయులకు విజ్ఞప్తీ ....జిల్ జిల్ జిగా...జిల్ జిల్ జిగా....కాలనీ వినాయకుని నిమజ్జనం సందర్బంగా ......జిల్ జిల్ జిగా...జిల్ జిల్ జిగా....'

'హేపీడేస్ పాట.. ప్లస్... భక్తులకి విజ్ఞప్తి' రీమిక్స్..మంచి టాలెంటెడ్ DJ.

'జిల్..జిగ.......రేపు మద్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరగబోతున్నది....కావున..బాత్రూం లో పాటలు...

బ్రేక్ ఫస్ట్ లో బాటలు ......అందరూ సహకరించి తోచినవిదంగా....ఇక బస్సులకయ్ వైటింగూ....బియ్యం మరియు '

'మీ...మట్టి,మశానం......ఆపండరరెయ్....' అప్ర్యత్నం గా పైకే పెద్దగా అరిచా..

'నేను ఇందాకే తిన్నా.....నువ్వు తిన్నావ్రా రిషిగా...' నా అరుపుకి సమాదానంగా అంది నాన్నమ్మ.

'ఏంటి....'

'నాకు పొద్దున్న ఎనిమిది కల్లా పడిపోవాలి...మాత్రలు వేసుకోవాలి కదరా...'

'ఏం పడాలే ...'

'తలకి కొబ్బరినూనె రాయనా......'

మా సౌండ్ ఇంజనీర్ తో..నా తిప్పలు చూసి..నవ్వుకుంటూ మా అమ్మ దగ్గర్కి పరిగెట్టాడు మా నాన్న.

.........................

బెంగులూరు నుంచి రాజమండ్రి సంవత్సరం పాటు ...జర్నీ చేసి..వచ్చిన అలసట...నీర్సం గా రూపాంతరం చెంది...కొబ్బరి నూనె సీసా మా నాన్నమ్మ చేతిలో పెట్టి...నా తల అప్పగించి .......కళ్ళు మూసుకున్నాను..

దూరంగా...గుళ్ళో ఎవడిదో కొత్త ఏడుపు.....
'ఆ..సత్తే ఎ గొడవా లేదు..సత్తే ఎ గొడవా లేదు..'...ముదురు ఏడుపు......